Top Four Reasons for India loss against South Africa: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీసు (India vs SouthAfrica T20 series)ను టీమ్‌ఇండియా ఓటమితో ఆరంభించింది. దిల్లీ వేదికగా తలపడిన తొలి మ్యాచులో 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. 212 పరుగుల టార్గెట్‌నూ రక్షించుకోలేక చతికిల పడింది. బౌలర్లు సమష్టిగా విఫలమయ్యారు. రిషభ్ పంత్‌ సేన ఓటమికి 4 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.


విచిత్రంగా ప్రవర్తించిన పిచ్‌


అరుణ్‌ జైట్లీ పిచ్‌ సాధారణంగా నెమ్మదిగా మందకొడిగా ఉంటుంది. స్పిన్నర్లు, స్లో బౌలర్లకు సహకరిస్తుంది. వేగంలో మార్పులు చేసే హర్షల్‌ పటేల్‌ వంటి పేసర్లకు అనుకూలిస్తుంది. కానీ నిన్నటి వికెట్‌కు ఇందుకు భిన్నంగా కనిపించింది. మొదట ఊహించని విధంగా బంతి బౌన్స్, స్వింగ్‌ అయింది. బంతి ఎలా బౌన్స్‌ అవుతుందో తెలియక వికెట్‌ కీపర్‌ డికాక్‌ ఇబ్బంది పడ్డాడు. రెండో బ్యాటింగ్‌కు వచ్చేసరికి వికెట్‌ ఫ్లాట్‌గా మారింది.


ప్చ్‌.. బౌలర్లు!


ఈ మ్యాచులో ఓటమికి ప్రధాన కారణం బౌలర్ల వైఫల్యం! జట్టులో అంతా అనుభవం ఉన్నవారే. అంతా అత్యున్నత స్థాయి క్రికెట్‌ ఆడుతున్నవారే! ఐపీఎల్‌లో రాణించినవారే. కానీ దిల్లీలో మాత్రం తేలిపోయారు. ఆరుగురు బౌలింగ్‌ చేస్తే ఏకంగా ఐదుగురు ఓవర్‌కు 10పైగా రన్స్‌ ఇచ్చేశారు. కఠినమైన లెంగ్తుల్లో బంతులు వేయలేకపోయారు. క్వింటన్‌ డికాక్‌ ఔటయ్యాక అసలు వికెట్లే తీయలేదు. కనీసం పరుగుల్ని నియంత్రించి ఒత్తిడి తేలేకపోయారు.


మిల్లర్‌ మళ్లీ కిల్లర్‌ అయ్యాడు!


సఫారీలు గెలిచారంటే డేవిడ్ మిల్లర్‌ (64), డుసెన్‌ (75) బ్యాటింగే కారణం! వీరిద్దరి భాగస్వామ్యమే దక్షిణాఫ్రికాను రక్షించింది. మూడు వికెట్లు పడ్డ తర్వాత వీరిద్దరూ వికెట్‌ పడకుండా అడ్డుకున్నారు. డుసెన్‌ మొదట్లో ఇబ్బంది పడ్డా తన సహచరుడు మిల్లర్‌ నుంచి ప్రేరణ పొందాడు. శ్రేయస్‌ క్యాచ్‌ విడిచేయడంతో రెచ్చిపోయాడు. ఇక కిల్లర్‌ మిల్లర్‌ తన ఐపీఎల్‌ ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. తనకిష్టమైనప్పుడు సునాయసంగా బౌండరీలు, సిక్సర్లు కొట్టేశాడు.


రిషభ్ పంత్‌ కెప్టెన్సీ!


రిషభ్‌ పంత్‌ కెప్టెన్సీ సైతం విమర్శల పాలైంది! టీమ్‌ఇండియాలో సాధారణంగా అక్షర్‌ పటేల్‌ను పవర్‌ప్లేలో బౌలింగ్‌ చేయిస్తారు. ఫీల్డ్‌ స్ప్రెడ్‌ అయ్యాక యూజీని దింపుతారు. పంత్‌ మాత్రం పవర్‌ప్లేలోనే యూజీకి బంతినివ్వడంతో ప్రిటోరియస్‌ దాడి చేశాడు. మూమెంటమ్‌ పోవడంతో బౌలర్‌ ఏం చేయలేకపోయాడు. మిడిల్‌ ఓవర్లలో రన్స్‌ కట్టడి చేయలేదు. హార్దిక్‌ పాండ్య సైతం తేలిపోయాడు. బౌలర్లను రొటేట్‌ చేయడంతో పంత్‌ ఇబ్బంది పడ్డాడు.