IND Vs SL T20I: శ్రీలంకతో జరుగుతున్న మొదటి టీ20లో టీమిండియా 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇషాన్ కిషన్ (89; 56 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (57 నాటౌట్; 28 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు)చెలరేగడంతో 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో చరిత్ అసలంక (53 నాటౌట్: 47 బంతుల్లో, ఐదు ఫోర్లు) అర్థ సెంచరీ సాధించాడు.
అదరగొట్టిన ఇషాన్, శ్రేయస్
టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకోవడం భారత్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. వెస్టిండీస్ సిరీస్‌లో విఫలమైన ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. తొలి 14 బంతుల్లో అతడు చేసింది 17 పరుగులే అయినప్పటికీ... అనంతరం లంకేయులకు చుక్కలు చూపించాడు. ఆ తర్వాతి 14 బంతుల్లో 40 పరుగులు సాధించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (44; 32 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్) కూడా మొదట్లో వేగంగా ఆడాడు. కానీ ఇషాన్ టాప్ గేర్‌కు వెళ్లిపోవడంతో మంచి సపోర్ట్ అందించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 111 పరుగులు జోడించారు. 12వ ఓవర్ ఆఖరి బంతికి రోహిత్‌ను లాహిరు బౌల్డ్ చేయడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది.
రోహిత్ ఔటైన సంతోషం శ్రీలంక బౌలర్లకు ఎక్కువ సేపు నిలవలేదు. వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ అంతకు మించి అనేలా ఆడాడు. ఇషాన్‌తో పాటు అయ్యర్ కూడా షాట్లు బాదేయడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. సెంచరీకి చేరువైన కిషన్‌ను జట్టు స్కోరు 155 వద్ద దసున్ శనక ఔట్ చేశాడు. దాంతో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా (3 నాటౌట్: 4 బంతుల్లో) సహకారంతో శ్రేయస్ రెచ్చిపోయాడు. ఆఖరి రెండు ఓవర్లలో ఎడాపెడా సిక్సర్లు, బౌండరీలు బాదేశాడు. శ్రేయస్, జడేజా మూడో వికెట్‌కు 44 పరుగులు జోడిస్తే... అందులో జడేజావి కేవలం మూడు పరుగులే. శ్రేయస్ జోరుతో టీమిండియా 20 ఓవర్లలో రెండు వికెట్లకు 199 పరుగులు చేసింది.
పూర్తిగా కంట్రోల్ చేసిన బౌలర్లు
200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. అసలు విజయం కోసం ఆడాలన్న దృక్ఫథమే శ్రీలంకలో కనిపించలేదు. ఇన్నింగ్స్ మొదటి బంతికే పతుమ్ నిశ్శంకను (0: 1 బంతికి) అవుట్ చేసి భువీ శ్రీలంకపై ఒత్తిడిని తీసుకువచ్చాడు. అనంతరం మూడో ఓవర్లో మరో ఓపెనర్ కమిల్ మిషారా (13: 12 బంతుల్లో, రెండు ఫోర్లు) వికెట్‌ను కూడా భువీనే తీశాడు. ఆ తర్వాత కూడా శ్రీలంక క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూనే ఉంది. దీంతో శ్రీలంక 10.5 ఓవర్లలో 60 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత చరిత్ అసలంక, చమీర కరుణ రత్నే (21: 14 బంతుల్లో, రెండు సిక్సర్లు) వికెట్ల పతనానికి కాసేపు అడ్డుకట్ట వేశారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 37 పరుగులు జోడించారు. ఈ సమయంలో బౌలింగ్‌కు వచ్చిన వెంకటేష్ అయ్యర్... కరుణరత్నేను అవుట్ చేసి భాగస్వామ్యానికి తెరదించాడు. అసలంక, దుష్మంత చమీర (24 నాటౌట్: 14 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. దీంతో శ్రీలంక 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, వెంకటేష్ అయ్యర్ రెండేసి వికెట్లు తీయగా... రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్‌లకు చెరో వికెట్ దక్కింది.
శ్రీలంక బ్యాటర్లు ప్రమాదకరంగా కనిపించకపోవడంతో రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో ఏకంగా ఏడుగురు బౌలర్లను ప్రయోగించాడు. భువనేశ్వర్, బుమ్రా, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, వెంకటేష్ అయ్యర్, రవీంద్ర జడేజా, దీపక్ హుడాలు ఈ మ్యాచ్‌లో బౌలింగ్ వేయడం విశేషం.