టీవీ చూస్తున్నప్పుడు మెడ నొప్పి రావడం సహజమే. సరిగ్గా కూర్చోకపోవడం లేదా ఎక్కువ సేపు టీవీ చూస్తున్నా ఈ సమస్య ఏర్పడుతుంది. ఇది సాధారణ సమస్యే కదా అని పెద్దగా పట్టించుకోం. కానీ, ఈ వ్యక్తికి ఎదురైన చేదు అనుభవం గురించి తెలిస్తే తప్పకుండా షాకవుతారు. అదేంటీ? మెడ నొప్పి వస్తే.. శరీరం మొత్తం చచ్చుబడిపోతుందా? పక్షవాతానికి గురవ్వుతామా? అని ఆశ్చర్యపోతారు. 


యూకేకు చెందిన 36 ఏళ్ల డ్యారెన్ రాబర్ట్స్ ఓ రోజు టీవీ చూస్తున్నప్పుడు అతడి మెడ, భుజాల వద్ద అకస్మాత్తుగా నొప్పి కలిగింది. ఆ భాగమంతా సూదులతో గుచ్చుతున్నట్లుగా అనిపించింది. అయితే, సాధారణ నొప్పే అనుకొని పెద్దగా పట్టించుకోలేదు. 20 నిమిషాల తర్వాత స్నానం చేస్తుండగా అతడి మెడ కింద శరీర భాగమంతా చచ్చుబడిపోయింది. ఒక్కసారిగా కూలబడిపోయాడు. కాళ్లు, చేతులు కదపలేకపోయాడు. కాసేపు తనకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కదల్లేని పరిస్థితుల్లో గట్టిగా కేకలు పెట్టడంతో ఇంట్లోవాళ్లు కంగారు పడ్డారు. వెంటనే అతడిని హాస్పిటల్‌కు తరలించారు. 


వెన్నుపాము(స్పైనల్ కార్డ్)కు అంతర్గతంగా ఏర్పడిన గాయం వల్ల అతడికి ఈ పరిస్థితి ఏర్పడినట్లు వైద్యులు తెలిపారు. దురదృష్టం ఏమిటంటే.. అతడు మళ్లీ సాధారణ స్థితికి చేరుకోలేకపోయాడు. శరీరం మొత్తం పక్షవాతానికి గురైంది. దీంతో అతడు మంచానికే పరిమితమయ్యాడు. తనకు ఎదురైన ఈ సమస్యపై రాబర్ట్ స్పందిస్తూ.. ‘‘టీవీ చూస్తున్నప్పుడు విపరీతమైన మెడ నొప్పి వచ్చింది. ఆ తర్వాత స్నానానికి వెళ్లాను. అకస్మాత్తుగా నా మెడ కింది శరీరమంతా చచ్చుబడిపోయి కుప్పకూలాను. కదల్లేని స్థితిలో ఉన్న నన్ను నా పేరెంట్స్ పైకిలేపారు. అంబులెన్స్ ద్వారా హాస్పిటల్‌కు తరలించారు. నాకు MRI తీసేసరికి శరీరంలో ఏ భాగాన్ని కదపలేని దుస్థితిలో ఉన్నాను’’ అని తెలిపాడు.


రాబర్ట్‌కు ఏమైంది?: ఆ సమస్య ఎందుకు ఏర్పడింది?: న్యూరాలజిస్టులు తెలిపిన వివరాల ప్రకారం.. అతడికి సూదులతో గుచ్చినట్లుగా నొప్పి కలిగినప్పుడే పరిస్థితి చేయిదాటిపోయింది. అతడి మెదడు శరీరంలోని ఇతర భాగాలకు సంకేతాలు ఇవ్వడం ఆపేసింది. అందుకే శరీర భాగాలేవీ పనిచేయలేదు. ఈ పరిస్థితినే వైద్య పరిభాషలో ‘డీమిలినేషన్’ (Demyelination) అని అంటారు. ‘మైలిన్ షీత్’ అని పిలువబడే నాడీ కణాల రక్షిత కవచానికి నష్టం ఏర్పడితే కలిగే పరిస్థితే ఇది.  ఇలా జరిగినప్పుడు వెన్నుపాము నుంచి మెదడుకు నరాల ప్రేరణల ప్రసారం ఆగిపోతుంది లేదా నెమ్మదిస్తుంది. దీనివల్ల నరాల సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. ఇలాంటి సమస్యలు ఏర్పడినప్పుడు థెరపీ చేసినా ఫలితం ఉండదు. రాబర్ట్‌‌కు ఇలాంటి సమస్యే ఏర్పడి ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు.


Also Read: జలుబు చేసి గతాన్ని మరిచిపోయిన మహిళ.. 20 ఏళ్ల మెమరీ మొత్తం లాస్!


ఈ కారణాల వల్ల పక్షవాతం రావచ్చు: వెన్నుపాములో వాపు వచ్చినవారికి ఇలాంటి పరిస్థితిని ఏర్పడవచ్చు. MNO యాంటీబాడీ, MOG యాంటీబాడీ వంటి ప్రతిరోధకాలు మనలో ఉండే సొంత కణాలకు వ్యతిరేకంగా ఉత్పత్తి అయినప్పుడు కూడా పక్షవాతం ఏర్పడవచ్చు. అలాగే మల్టిపుల్ స్క్లెరోసిస్ (MS) సమస్య కూడా పక్షవాతానికి దారితీసే అవకాశం ఉంది. యాంటీరియర్ స్పైనల్ ఆర్టరీ సిండ్రోమ్, రక్తపోటు, డయాబెటీస్ కూడా పక్షవాతానికి దారితీయొచ్చు. చాలామందిలో పక్షవాతం శాస్వతంగా ఉంటుంది. కొందరిలో స్టెరాయిడ్స్ లేదా ప్లాస్మా మార్పిడి చికిత్స ద్వారా చికిత్స అందించవచ్చని వైద్యు నిపుణులు చెబుతున్నారు.


Also Read: ఉదయాన్నే శృంగారంలో పాల్గోవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?


గమనిక: వివిధ వ్యాధులు, వాటి తీరుపై మీకు అవగాహన కలిగించేందుకే ఈ కథనాన్ని అందించామని గమనించగలరు. వివిధ సంఘటనలు, అధ్యయనాలు, వైద్య నిపుణులు తెలిపిన వివరాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ కథనం చికిత్స లేదా వైద్య సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎలాంటి బాధ్యత వహించదు.