Ind vs SA, Rishabh pant century: టీమ్‌ఇండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్ పంత్‌ అరుదైన రికార్డు సృష్టించాడు. ఎంఎస్‌ ధోనీకి సాధ్యమవ్వని ఘనతలను అందుకుంటున్నాడు. ఆసియా ఆవల మూడు సెంచరీలు చేసిన ఏకైక భారత వికెట్‌కీపర్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు రెండో ఇన్నింగ్సులో అతడు శతకం బాదేశాడు.


ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌-2లో రిషభ్‌ పంత్‌ బ్యాటింగ్‌ ఏ మాత్రం బాగాలేదు. కొన్నాళ్లుగా అతడు అభిమానులను నిరాశపరుస్తూనే ఉన్నాడు. చెత్త షాట్లకు ఔటవుతున్నాడు. అతడు మరింత పరిణతిగా ఆడాలని చాలామంది మాజీ క్రికెటర్లు చెబుతూనే ఉన్నారు. ఇన్నాళ్లకు అత్యంత కీలకమైన టెస్టు మ్యాచులో అతడు వారి ఆశలను నెరవేర్చాడు.


Also Read: IPL New Sponsor: వివో ఔట్‌! ఇకపై 'టాటా ఐపీఎల్‌'! చైనా కంపెనీకి గుడ్‌బై!!


Also Read: IPL Auction 2022 Date: క్రికెటర్లూ కాచుకోండి! ఇక డబ్బుల పండగే!! ఫిబ్రవరి 12, 13న ఐపీఎల్‌ మెగా వేలం


Also Read: Tata Group IPL Sponsor: మైదానంలో సిక్సర్ల వర్షం.. బీసీసీఐకి కాసుల వర్షం..! టాటా రావడంతో బోర్డుకు ఎంత డబ్బు వస్తోందంటే?


కేప్‌టౌన్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 139 బంతుల్లో 6 బౌండరీలు, 4 సిక్సర్లతో 100 పరుగులతో రిషభ్ పంత్‌ అజేయంగా నిలిచాడు. ఇందుకోసం అతడు 236 నిమిషాలు క్రీజులో ఉన్నాడు. ఎంతో విలువైన, చక్కని షాట్లను ఆడాడు. టీమ్‌ఇండియా ఈ ఇన్నింగ్సులో 198 పరుగులు చేస్తే అందులో అతడివే సగం కావడం ప్రత్యేకం. ఇక కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో కలిసి ఐదో వికెట్‌కు 179 బంతుల్లో 94 పరుగుల భాగస్వామ్యం అందించాడు.






ఇక రికార్డు విషయానికి వస్తే టీమ్‌ఇండియా తరఫున ఎంతో మంది కీపింగ్‌ చేశారు. సొంతగడ్డపై చాలా శతకాలైతే కొట్టారు కానీ ఆసియా ఆవల చేసింది మాత్రం తక్కువే! ఇప్పటి వరకు నమోదైనవి కేవలం ఏడు. అందులో మూడు రిషభ్ పంత్‌వే.  2018లో ఓవల్‌లో ఇంగ్లాండ్‌పై 114, 2018/19లో సిడ్నీలో ఆసీస్‌పై 159*, 2021/22లో కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాపై 100* చేశాడు. అంతకు ముందు 1952/53లో వెస్టిండీస్‌పై కింగ్‌స్టన్‌లో  వి.మంజ్రేకర్‌ 118, 2002లో అజయ్‌ రాత్రా సెయింట్‌ జాన్స్‌లో వెస్టిండీస్‌పై 115*, 2016లో వెస్టిండీస్‌పై గ్రాస్‌ఐస్‌లెట్‌లో వృద్ధిమాన్‌ సాహా 114  సెంచరీలు సాధించారు. దేశానికి సుదీర్ఘ సేవలు అందించిన ఎంఎస్ ధోనీ మాత్రం ఆసియా ఆవల ఒక్క సెంచరీనైనా కొట్టలేదు.