కోవిడ్ వైరస్ ఇంతకుముందెన్నడూ లేనంత వేగంతో వ్యాప్తి చెందుతోందని, ఒమైక్రాన్ వేరియంటే ఇందుకు ప్రధాన కారణమని విశాఖపట్నంలోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఆర్.వి. రవి కన్నబాబు తెలిపారు. ఒమైక్రాన్ వ్యాప్తిపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఒమిక్రాన్ అత్యంత సులభంగా మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుందన్నారు. ముఖం, ముక్కును కవర్ చేసేలా మాస్కులు ధరించడం, భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎన్95 మాస్కులే అవసరం లేదని, ఎలాంటి మాస్క్ అయినా బాగా పట్టి ఉంచేలా చూసుకోవాలని ఆయన తెలిపారు. కోవిడ్ థర్డ్ వేవ్ లో అత్యంత ఎక్కువ కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో విశాఖపట్నం ఒకటని, పండుగ తర్వాత కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే కోవిడ్ వ్యాప్తి మొదలైందని, అందువల్ల సంక్రాంతికి ఊళ్లు వెళ్లకపోవడమే మంచిదని సూచించారు. తప్పనిసరిగా వెళ్లాల్సి వచ్చినా ఎక్కడా మాస్కు తీయకూడదని, వేరే ఇంటికి వెళ్లి, మాట్లాడేటప్పుడు మాస్కు తీసినా కోవిడ్ వచ్చే ప్రమాదం ఉందని అన్నారు.
(విశాఖపట్నం కిమ్స్ ఐకాన్ ఆసుపత్రి వైద్యులు డా.రవి కన్నబాబు)
ఆసుపత్రుల్లో చేరికలు తక్కువే ...కానీ
ప్రస్తుతం నమోదవుతున్న ప్రతీ నాలుగు కేసుల్లో ఒకటి ఒమైక్రాన్ ఉంటుందని డాక్టర్. రవి కన్నబాబు అన్నారు. అయితే భవిష్యత్తులో ఒమైక్రాన్ కేసులు భారీగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. సెకండ్ వేవ్‌లో ఉన్నంతగా థర్డ్ వేవ్ లో ఆసుపత్రిలో చేరికలు లేవన్నారు. అయితే కేసులు పెరిగేకొద్ది ఆసుపత్రుల్లో చేరికలు పెరిగే అవకాశం ఉందన్నారు. గొంతులో గరగర, జలుబు, దగ్గు, కొద్దిపాటి జ్వరం, నీరసం తలనొప్పి, ఒళ్లు నొప్పుల లాంటి లక్షణాలు ఉంటాయని చెప్పారు. కొంతమంది ఇంటివద్దే పరీక్షలు చేయించుకుంటున్నారని, వాటిలోనూ పాజిటివ్‌లు బయటపడుతున్నాయని చెప్పారు. కోవిడ్ లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా వెంటనే పరీక్ష చేయించుకోవాలని డాక్టర్ రవి కన్నబాబు సూచించారు. ఒకవేళ పాజిటివ్ అని తెలిస్తే వైద్యులు సూచించిన మందులు వాడటంతో పాటు తగినన్ని నీరు తీసుకోవడం, విశ్రాంతిగా ఉండటం, పోషకాహారం తీసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు ఆక్సిజన్ శాచ్యురేషన్ తప్పనిసరిగా చూసుకోవాలని, అందులో ఏదైనా మార్పు కనిపిస్తే వెంటనే వైద్యసాయం పొందాలని ఆయన తెలిపారు.
Also Read: సంక్రాంతి స్పెషల్.. 8 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
వ్యాక్సినేషన్ చాలా ముఖ్యం
కోవిడ్‌లో ఎలాంటి వేరియంట్ వచ్చినా, వ్యాధి తీవ్రతరం కాకుండా కాపాడటంలో టీకాల పాత్ర చాలా ముఖ్యమని, అందువల్ల ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని డాక్టర్ రవి కన్నబాబు అన్నారు. సాధారణ ఆర్‌టీపీసీఆర్ పరీక్షతోనూ ఒమైక్రాన్‌ను గుర్తించవచ్చని, మూడు టార్గెట్ జన్యువుల్లో ఒకటైన ఎస్ జన్యువు లేకపోతే అది ఒమైక్రాన్ అయ్యే అవకాశం ఉందని అన్నారు. టీకాలు తీసుకున్నా, తీసుకోకపోయినా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని సూచించారు.
Also Read: " టాలీవుడ్ రియాక్షన్ " ఆపడమే అసలు వ్యూహం ! జగన్ ప్లాన్ వర్కవుట్ అయినట్లేనా ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి