దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ పట్టు బిగించింది. 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నాలుగో రోజు ఆట ముగిసేసరికి దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. చివరి రోజు విజయానికి దక్షిణాఫ్రికా 211 పరుగులు చేయాల్సి ఉండగా.. భారత్‌కు ఆరు వికెట్లు కావాలి.


వికెట్ నష్టానికి 16 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 174 పరుగులకు ఆలౌట్ అయింది. పంత్ (34: 34 బంతుల్లో, ఆరు ఫోర్లు) టాప్ స్కోరర్. పిచ్ బౌలింగ్‌కు సహకరిస్తుండటంతో భారత్ బ్యాట్స్‌మెన్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడ, జాన్సన్ నాలుగేసి వికెట్లు తీయగా.. ఎంగిడికి రెండు వికెట్లు దక్కాయి.


305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయి 94 చేసింది. డీన్ ఎల్గర్ (52 బ్యాటింగ్: 122 బంతుల్లో, ఏడు ఫోర్లు) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఆట ఆఖరి బంతికి కేశవ్ మహరాజ్ అవుటయ్యాడు. భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు తీయగా.. షమీ, సిరాజ్‌లకు చెరో వికెట్ దక్కింది.


అయితే చివరిరోజు వర్షం పడే సూచనలు ఎక్కువ ఉండటంతో.. ఆట జరుగుతుందా లేదా అన్నదానిపై అనుమానాలు నెలకొన్నాయి. వర్షం అడ్డుకున్నప్పటికీ.. కనీసం 50 ఓవర్ల ఆట సాధ్యం అయినా.. మ్యాచ్‌లో ఫలితం వచ్చే అవకాశం ఉంది.