కామారెడ్డి జిల్లా తిమ్మక్ పల్లి వాసి నవీన్ కుమార్.. ఆర్మీ జవాన్. రాజస్థాన్ లోని జ్యోథ్ పూర్ లో  విధులు నిర్వహిస్తున్నాడు. ఆగస్ట్ 4, 2021న సెలవుపై తన సొంతూరికి వచ్చాడు. ఎంతోకాలం దూరంగా గడిపిన నవీన్... సుమారు 25 రోజుల పాటు తన కుటుంబంతో ఉన్నాడు. ఒకింత బాధతోనే... మళ్లీ తిరిగి విధుల్లో జాయిన్ అయ్యేందుకు.. ఆగస్ట్ 29వ తేదీన తిరిగి రాజస్థాన్ బయల్దేరాడు. కామారెడ్డిలో హైదరాబాద్ బస్సెక్కి.. అక్కడినుంచి రాజస్థాన్ వెళ్లడమనేది నవీన్ జర్నీ ప్లాన్. కానీ... కామారెడ్డీ నుంచి హైదరాబాద్ బస్సెక్కిన నవీన్ ఫోన్... ఏమైందో, ఏమోగానీ... తెల్లవారి నుంచి స్విచ్ ఆఫ్ అయిపోయింది.  


తమతో గడిపిన నవీన్ మళ్లీ తిరిగి వెళ్లిపోతున్నాడని ఒకింత బాధగా ఉన్న నవీన్ కుటుంబంలో... ఆందోళన మరింత తీవ్రమైంది. దాంతో రాజస్థాన్ లోని నవీన్ పనిచేసే ఆర్మీ క్యాంపుకు ఫోన్ చేసి... నవీన్ స్నేహితులు, ఇతర అధికారులను నవీన్ అక్కడికి చేరుకున్నాడో, లేదో ఆరా తీశారు. అక్కడి నుంచి రాలేదు అనే సమాధానం రావటంతో... కుటుంబంలో నవీన్ ఏమైపోయాడన్న ఆందోళన మరింత పెరిగింది. 


నవీన్ తాను ఉద్యోగానికి వెళ్లకుండా.. ఇంకెక్కడైనా బంధువుల దగ్గరకుగానీ, స్నేహితుల దగ్గరకుగానీ వెళ్లి ఉంటాడా అనే కోణంలోనూ కుటుంబీకులు ఫోన్లు చేసి ఆరాతీశారు. కానీ ఎవ్వరికి ఫోన్ చేసినా... నవీన్ రాలేదనే సమాధానమే వినిపించింది. పైగా క్రమశిక్షణ కలిగిన ఓ ఆర్మీ ఉద్యోగిగా... తాను బంధువులనో, స్నేహితులనో కలిసి వెళ్లేదుంటే..  ఇంట్లో చెప్పకుండా వెళ్లే రకమేమీ కాదని అంటున్నారు స్థానికులు. ఆందోళన మరింత ఎక్కువైన కుటుంబ సభ్యులు..  సరిగ్గా వారం తర్వాత సెప్టెంబర్ 4, 2021వ తేదీన కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో నవీన్ అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఒక ఆర్మీ జవానే కనిపించకుండా పోవడం... అప్పటికే గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.


ఓ ఆర్మీ జవాన్ మిస్సపోయినా... ఆ స్థాయిలో కనీసం దర్యాప్తు కొనసాగుతుందా అనేది ఇప్పుడు కుటుంబ సభ్యుల్లో, నవీన్ స్నేహితులు, గ్రామస్థుల్లో బలపడుతున్న ఓ అనుమానం. మరోవైపు నవీన్ కనిపించకుండా పోవడమంటే... అదేం ఆషామాషీ వ్యవహారం కూడా కాదు. దాన్ని దేశభద్రత కోణంలో కూడా చూడాల్సి ఉన్న నేపథ్యంలో... అసలు నవీన్ ను ఎవరైనా కిడ్నాప్ చేసుంటారా...? చేస్తే అది ఎవరి పనై ఉంటుంది...? ఒకవేళ దేశద్రోహుల పని కాదు కదా...? లేక ఇంకెవరైనా కిడ్నాప్ చేసుంటారా...? లాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం లభించాల్సిన అవసరమైతే ఉంది.


Also Read: Amul In Telangana : హైదరాబాద్‌లో రూ.500 కోట్లతో అమూల్ భారీ ప్లాంట్ ... ప్రభుత్వంతో ఎంవోయూ !


Also Read: Telangana High Court: పబ్బుల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు.. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు సరిపోతాయా?


Also Read: Harish Sekhar Kammula : ప్రజానాయకుడు హరీష్ రావు .. ఈ సర్టిఫికెట్ ఇచ్చింది దర్శకుడు శేఖర్ కమ్ముల ! ఎందుకో తెలిస్తే..