భారత్, దక్షిణాఫ్రికాల మధ్య సెంచూరియన్ పార్క్ మైదానంలో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట వర్షం కారణంగా ఆలస్యం అయింది. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఇప్పటికీ ఆట ప్రారంభం కాలేదు. మధ్యలో ఒకసారి వర్షం ఆగడంతో.. ఆట ప్రారంభం కావడంపై ఆశలు చిగురించినప్పటికీ.. తర్వాత మళ్లీ కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. ఈరోజు ఆట జరగడం కష్టమేనని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


మూడో రోజు, నాలుగో రోజు వర్ష సూచనలు లేకపోయినా.. ఐదో రోజు మళ్లీ వర్షం పడే అవకాశం ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఫలితం వస్తుందో, రాదో తెలియాల్సి ఉంది. వర్షం ఆగితే వీలైనంత ఎక్కువ సేపు ఆడటానికి లంచ్ విరామాన్ని కూడా ముందుకు జరిపారు. ఇప్పటికే లంచ్ కూడా ముగిసిపోయింది.


తొలిరోజు ఆట ముగిసే సరికి టీమిండియా 90 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (122 బ్యాటింగ్: 248 బంతుల్లో, 16 ఫోర్లు, ఒక సిక్సర్) శతకం సాధించగా.. తనతోపాటు అజింక్య రహానే (40 బ్యాటింగ్: 81 బంతుల్లో, 8 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి మూడు వికెట్లు తీసుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌ (60: 123 బంతుల్లో, 9 ఫోర్లు), కేఎల్‌ రాహుల్‌ అద్భుతంగా ఆడటంతో మొదటి సెషన్‌లో ఒక్క వికెట్ కూడా పడలేదు. లంచ్‌ సమయానికి టీమిండియా 28 ఓవర్లకు వికెట్‌ నష్టపోకుండా 83 పరుగులు సాధించింది.







రెండో సెషన్‌లో కూడా టీమిండియా ఓపెనర్లు ఎటువంటి తడబాటు లేకుండా ఆడారు. ఇన్నింగ్స్ 30వ ఓవర్లో మయాంక్ అగర్వాల్ తన అర్థసెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు.ఈ క్రమంలోనే రాహుల్, మయాంక్ మొదటి వికెట్‌కు 100 పరుగులు జోడించారు. దక్షిణాఫ్రికా గడ్డ మీద భారత ఓపెనర్లు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం ఇది కేవలం మూడోసారి మాత్రమే.


మొదటి వికెట్‌కు 117 పరుగులు జోడించిన అనంతరం ఎంగిడి బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్ ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. ఆ తర్వాతి బంతికే పుజారా (0: 1 బంతి) కూడా పీటర్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రాహుల్‌కు కెప్టెన్ కోహ్లీ జతకలిశాడు. మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించిన అనంతరం లుంగి ఎంగిడి బౌలింగ్‌లోనే విరాట్ కోహ్లీ అవుటయ్యాడు. 


ఆ తర్వాత రహానే, కేఎల్ రాహుల్ మరో వికెట్ పడకుండా ఆడారు. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ శతకం కూడా పూర్తయింది. దీంతో భారత్ మొదటిరోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 272 పరుగులు సాధించింది.


Also Read: Sreesanth, Ranji Trophy: జెర్సీలో నానీ అరిచినట్టే..! శ్రీశాంత్‌ భావోద్వేగం


Also Read: IND vs SA, Hanuma Vihari left: మా తెలుగు ఆటగాడు చేసిన తప్పేంటి? టీమ్‌ఇండియాపై విమర్శల వర్షం!!


Also Read: England Ducks 2021: అమ్మబాబోయ్.. అన్ని డకౌట్లా.. అత్యంత చెత్త రికార్డు సాధించిన ఇంగ్లండ్!