తన హత్యకు రెక్కీ నిర్వహించారంటూ వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ చేసిన ఆరోపణలు బెజవాడ రాజకీయాల్లో  కలకలం రేపుతున్నాయి.  ఆధారాలు కూడా ఉన్నాయని వంగవీటి రాధాకృష్ణ చెప్పడంతో ఎవరు ఆ పని చేశారన్న చర్చ సహజంగానే ప్రారంభమయింది. బెజవాడలో హత్యా రాజకీయాలు ఇటీవలి కాలంలో లేవు. కానీ రాజకీయ ప్రత్యర్థులపై దాడులు మాత్రం  గత రెండేళ్లలో పెరిగాయి. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై ఓ సారి ఆయన ఇంటి ముందే హత్యాయత్నం జరిగింది. ఆ తర్వాత మరోసారి ఆయన ఇంట్లోకి చొరబడి బీభత్సం సృష్టించారు. 


Also Read: ఆనందయ్య ఇంటి ఎదుట గ్రామస్థుల ధర్నా.. అందరూ వెళ్లిపోవాలని డిమాండ్, ఎందుకంటే..


అలాగే గత రెండేళ్లుగా బెజవాడలో కొన్ని రౌడీ గ్యాంగ్ వార్‌లూ జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో వంగవీటి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వంగవీటిపై  రెక్కీ నిర్వహించారంటూ  ఆయన ఇంటి చుట్టూ కొన్నాళ్ల క్రితం తిరిగిన ఓ కారు దృశ్యాలను కొంత మంది వైరల్ చేస్తున్నారు. ఆ కారు ఎవరిదని.. ఆరా తీస్తున్నారు. అయితే ఈ దృశ్యాలను వంగవీటి క్యాంప్ విడుదల చేసిందా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. ఈ అంశంపై వారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. సున్నితమైన అంశం కావడంతో పోలీసులే అంతర్గతంగా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. 


Also Read: జనవరి 28న రాజధాని పిటిషన్లపై పూర్తి స్థాయి వాదనలు.. విచారణ కొనసాగించాలని రైతుల విజ్ఞప్తి !


మరో వైపు వంగవీటి రాధా జోలికి ఎవరు వచ్చినా సహించబోమని ఆయన సోదరుడు వంగవీటి నరేంద్ర తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆయన ప్రస్తుతంభారతీయ జనతా పార్టీలో ఉన్నారు. తాము రాజకీయంగా వేరైనా కుటుంబ పరంగా ఒక్కటేనని.. ఎవరైనా తమ కుటుంబం జోలికి వస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో ఉన్నారు. అమరావతి ఉద్యమంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. అయితే టీడీపీ కార్యక్రమాల్లో మాత్రం యాక్టివ్‌గా పాల్గొనడం లేదు. 


Also Read: నన్ను హత్య చేసేందుకు రెక్కీ చేశారు... నేను దేనికైనా రెడీ... వంగవీటి రాధాకృష్ణ


గత ఎన్నికల ముందు వరకూ వైఎస్ఆర్‌సీపీలో ఉన్న వంగవీటి .. అక్కడ తనకు అవమానాలు జరగడంతో బయటకు వచ్చేశారు. టీడీపీలో చేరారు. అయితే టీడీపీకి ప్రచారం చేశారు కానీ ఎక్కడా పోటీ చేయలేదు. అయితే ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలకు...రాజకీయాలకు సంబంధం లేదని..  రెక్కీ నిర్వహించారన్న పక్కా సమాచారం ఉండబట్టే వ్యాఖ్యానించారని అంటున్నారు. మొత్తంగా బెజవాడ రాజకీయాల్లో మళ్లీ కాస్తంత ఉద్రిక్తతమైన చర్చలకు వంగవీటి రాధాకృష్ణ ఆరోపణలు కారణం అవుతున్నాయి. 


Also Read: సీజేఐకు ఆయేషా మీరా తల్లిదండ్రుల లేఖ... 14 ఏళ్లుగా న్యాయం దక్కడంలేదని ఆవేదన


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి