సొంత గడ్డపై సఫారీలు దుమ్మురేపారు! టీమ్‌ఇండియాతో తొలి వన్డేలో ఇరగదీశారు! కఠిన పిచ్‌పై తెంబా బవుమా (110; 143 బంతుల్లో 8x4 ) అద్వితీయ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. శతకంతో మురిశాడు. అతడికి తోడుగా వాన్ డర్ డుసెన్ (129*; 96 బంతుల్లో 9x4, 4x6) అజేయ శతకం బాదేసిన వేళ దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. కేఎల్ రాహుల్ సేనకు 297 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. వికెట్లు తీసేందుకు టీమ్‌ఇండియా బౌలర్లు శ్రమించాల్సి వచ్చింది. జస్ప్రీత్ బుమ్రా 2, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ తీశారు.
Also Read: Team India Next Captain: విరాట్ కోహ్లీ వారసుడి పేరు సూచించిన గావస్కర్..! లాజిక్ ఇదే!
Also Read: Mohammed Siraj on Kohli: నువ్వెప్పుడూ నా కెప్టెనే! ధోనీకి కోహ్లీ.. కోహ్లీకి సిరాజ్!
Also Read: Lucknow IPL Franchise: కేఎల్ రాహుల్ ఓకే! లఖ్‌నవూ మిగతా ఆటగాళ్లెవరో తెలుసా!!
క్రీజులో పాతుకుపోయి
టాస్ గెలిచిన వెంటనే దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. పార్ల్ పిచ్ మందకొడిగా కనిపించింది. వికెట్లో వేగం లేదు. అయినప్పటికీ సఫారీలు భారీ స్కోరు చేశారంటే అందుకు తెంబా బవుమా, వాన్ డర్ డుసెన్ బ్యాటింగే కారణం! వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 184 బంతుల్లో 204 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. జట్టు స్కోరు 19 వద్దే ఓపెనర్ జానెమన్ మలన్ (6)ను జస్ప్రీత్ బుమ్రా పెవిలియన్ పంపించాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన బవుమా మొదట్లో మెల్లగా ఆడాడు. టీమ్‌ఇండియా బౌలర్ల బౌలింగ్ లయను గమనిస్తూ క్రీజులో నిలిచాడు. 76 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. 16వ ఓవర్లో క్వింటన్ డికాక్ (27)ను అశ్విన్ ఔట్ చేయడం, అయిడెన్ మార్‌క్రమ్ (4) రనౌట్ అయ్యాక సఫారీల్లో ఒత్తిడి పెరుగుతుందని భావించినా అది జరగలేదు.
అతడొచ్చాక..
డుసెన్ అండగా నిలవడంతో బవుమా నిలకడగా ఆడాడు. మధ్య ఓవర్లలో వీరిద్దరూ యుజ్వేంద్ర చాహల్‌ను స్వీప్ షాట్లతో ఎదుర్కొన్నారు. దూకుడైన షాట్లు ఆడకుండా ఒక్కో పరుగు చేశారు. 49 బంతుల్లో డుసెస్ అర్ధశతకం అందుకోవడంతో 38.1 ఓవర్లకు దక్షిణాఫ్రికా 200 పరుగుల మైలురాయి అందుకుంది. ఆ తర్వాత వీరిద్దరూ టీమ్‌ఇండియా సహనానికి పరీక్ష పెట్టారు. ఎంతకీ ఔటవ్వకపోవడంతో ఆరో బౌలర్ వెంకటేశ్ అయ్యర్‌కు రాహుల్ బంతినే ఇవ్వలేదు. 133 బంతుల్లో బవుమా, 83 బంతుల్లో డుసెన్ సెంచరీలు చేయడంతో 48 ఓవర్లకు దక్షిణాఫ్రికా 272/3తో నిలిచింది. 48.1వ బంతికి బవుమాను బుమ్రా ఔట్ చేసినా అప్పటికే ఆలస్యం జరిగిపోయింది.