ఐసీసీ ప్రపంచకప్పుల్లో కొన్నేళ్లుగా ఓటమెరుగని చరిత్ర మనది. బరిలోకి దిగిన ప్రతిసారీ విజయమే వరించేది. అలాంటిది టీమ్‌ఇండియాకు తొలిసారి పాకిస్థాన్‌ షాకిచ్చింది. కసితీరా కోహ్లీసేనను ఓడించింది. ఈ పరాభవం అభిమానులను బాధించినా ఒకందుకు మంచిదే!


ఎందుకంటే ఎంతగొప్ప ధీరుడైనా యుద్ధంలో ఒకసారి ఓడితేనే కదా మనమేంటో తెలిసేది! ఎందుకంటే ఓటములే కదా అసలు సిసలైన విజేతను తట్టిలేపేది! ఎందుకంటే  గాయపడ్డ సింహం నాలుగు అడుగులు వెనక్కివేసేది లోపాలను సరిదిద్దుకొనేందుకే కదా! అందుకే ఈ గాయం అటు సెంటిమెంటు ఇటు ఆట పరంగా మంచిదే!


సరిదిద్దుకోవచ్చు
టీమ్‌ఇండియా ప్రపంచంలోనే తిరుగులేని జట్టు. దీంట్లో సందేహమేమీ లేదు. ఎంత గొప్ప జట్టైనా? అందులో ఎంతగొప్ప వీరులున్నా కొన్ని బలహీనతలు ఉండటం సహజమే. వీటిని సరిదిద్దుకోవాలని పాక్‌ ఓటమి కనువిప్పు కలిగించింది. ఆరంభంలోనే ఎదురైన పరాభవం ఆఖరి వరకు జైత్ర యాత్ర కొనసాగించేందుకు ఇంధనంగా మారుతుంది. మన లోపాలను సరిదిద్దుకొనేందుకు ఉపయోగపడుతుంది. రోహిత్‌, రాహుల్‌ ఇకపై మరింత జాగ్రత్తగా ఆడతారు. మొదట బ్యాటింగ్‌ చేస్తే ఎక్కువ స్కోరు చేయాలని తెలుసుకుంటారు. మంచు కురిస్తే మరింత కట్టుదిట్టంగా బంతులెలా వేయాలో బౌలర్లు అందిపుచ్చుకుంటారు. కివీస్‌, ఆసీస్‌, ఇంగ్లాండ్‌, విండీస్‌ వంటి జట్లతో సెమీస్‌లో తలపడేందుకు ఈ ఓటమి వ్యూహాలు రచించేలా చేస్తుంది.


ఓటమి తర్వాత గెలుపే
పాక్‌ చేతిలో ఓటమి దారుణమే అయినా కోహ్లీసేన వేగంగా పుంజుకుంటుంది. గత చరిత్ర ఇదే చెబుతోంది. కొంతకాలం ముందు గులాబీ టెస్టులో ఆసీస్‌ చేతిలో టీమ్‌ఇండియా 36 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత విరాట్‌ కోహ్లీ కూడా లేడు. అలాంటిది తర్వాతి మ్యాచులో గెలిచింది. సీనియర్‌ పేసర్లు, బ్యాటర్లు ఒక్కొక్కరుగా దూరమైనా తర్వాతి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఇక ఆఖరి పోరులో మహ్మద్‌ సిరాజ్‌, శుభ్‌మన్‌, సుందర్‌, శార్దూల్‌, పంత్‌ వంటి యువకులు చెలరేగడంతో సిరీస్‌ గెలిచి చరిత్ర సృష్టించింది. ఐపీఎల్‌కు ముందు ఇంగ్లాండ్‌లోనూ అదే జరిగింది. తొలి టెస్టు డ్రా చేసింది. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో లోటుతో దిగి ఇంగ్లాండ్‌ను ఓడించింది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 78కే ఆలౌటైంది. ఒక ఇన్నింగ్స్‌ తేడాతో ఓడింది. నాలుగో టెస్టులోనూ లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించి విజయం అందుకుంది. ఇప్పుడు ఎదురైన ఓటమి నుంచీ కోహ్లీసేన అలాగే పుంజుకుంటుంది.


ఓపెనర్లు విఫలమైతే.. కప్పు మనదే!
పాక్‌ చేతిలో ఓటమి సెంటిమెంటు పరంగా లక్కీ! ఈ పోరులో ఓపెనర్లు రాహుల్‌ (3), రోహిత్‌ (0) త్వరగా ఔటయ్యారు. గతంలో ఓపెనర్లు విఫలమైనప్పుడు భారత్‌ టైటిళ్లు కొట్టేసింది. 2007 టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో గ్రూప్‌ మ్యాచ్‌లో గంభీర్‌, సెహ్వాగ్‌ విఫలమయ్యారు. కానీ అదే టోర్నీ ఫైనల్లో దాయాదిపైనే గెలిచి ధోనీసేన కప్పు కొట్టేసింది. 2016 ఆసియా కప్‌లోనూ పాక్‌ పోరులో భారత్‌ ఓపెనర్లు రోహిత్‌, రహానె డకౌట్‌ అయ్యారు. ఆ టోర్నీలో భారత్‌ విజేతగా ఆవిర్భవించింది. ఈ సారీ అదే సెంటిమెంటు పనిచేస్తుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారు.


ముందే ఓడాం.. పోయేదేం లేదు!
ఈ మధ్య కాలంలో టీమ్‌ఇండియా వరుసగా మ్యాచులు గెలుస్తూ ఆఖర్లో బోల్తా పడుతోంది. 2015 వన్డే ప్రపంచకప్‌, 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్‌లో ఇలాగే జరిగింది. మొదట ప్రత్యర్థులను దడదడలాడించింది. కీలకమైన సెమీసుల్లో స్వల్ప తేడాలతో ఓటమి పాలైంది. ఛాంపియన్స్‌ ట్రోఫీలోనైతే ఫైనల్‌లో నిరాశపరిచింది. ఈ మెగా టోర్నీలో తొలి మ్యాచే ఓడటం వల్ల ఇకపై ఓడిపోవద్దన్న కసి కోహ్లీసేనలో కలుగుతుంది. అది సెమీస్‌, ఫైనళ్లలో మనల్ని విజయ తీరాలకు తీర్చే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతోంది!


Also Read: నలుగురు కెప్టెన్లు.. నానా చర్చలు.. 18 ఓవర్‌ ముందు యాంటీ క్లైమాక్స్‌! 'నా మాటే శాసనం' అని ఎవరన్నారో?


Also Read: పాక్‌ విజయానికి 'పంచ సూత్రాలు'.. కోహ్లీసేన పరాభవానికి కారణాలు! మిస్టేక్ అయింది ఇక్కడే..!


Also Read: India Vs Pakistan: నిన్న వెస్టిండీస్.. నేడు టీమిండియా.. ‘6’ సెంటిమెంట్ వెక్కిరించిందా?


Also Read: IND vs PAK, Match Highlights: దాయాది చేతిలో దారుణ ఓటమి.. పాక్‌పై పది వికెట్లతో చిత్తయిన టీమిండియా!