IND Vs NZ 2nd Test 1st Day Highlights: భారత్, న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మొదటి రోజు నుంచే రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్ 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 16 పరుగులు చేసి మొదటి రోజును ముగించింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ ఏడు వికెట్లు పడగొట్టాడు. రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీసుకున్నాడు. బ్యాటర్లలో రోహిత్ శర్మ (0: 9 బంతుల్లో) డకౌట్ అయ్యాడు. శుభ్‌మన్ గిల్ (10 బ్యాటింగ్: 32 బంతుల్లో, ఒక ఫోర్), యశస్వి జైస్వాల్ (6 బ్యాటింగ్: 25 బంతుల్లో, ఒక ఫోర్) క్రీజులో ఉన్నారు.


టాస్ గెలిచి బ్యాటింగ్‌కు...
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ బ్యాటింగ్ తీసుకున్నాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలో న్యూజిలాండ్ కాస్త దూకుడుగా ఆడే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలోనే ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ టామ్ లాథమ్ (15: 22 బంతుల్లో, రెండు ఫోర్లు) వేగంగా ఆడే ప్రయత్నంలో రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 32 పరుగులు మాత్రమే. వన్ డౌన్‌లో వచ్చిన విల్ యంగ్‌తో (18: 45 బంతుల్లో, రెండు ఫోర్లు) కలిసి మరో ఓపెనర్ డెవాన్ కాన్వే (76: 141 బంతుల్లో, 11 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. వీరి భాగస్వామ్యం బలపడుతున్న సమయంలో అశ్విన్ న్యూజిలాండ్‌ను మళ్లీ దెబ్బ తీశాడు. నిలకడగా ఆడుతున్న విల్ యంగ్‌ను బోల్తా కొట్టించాడు. డెవాన్ కాన్వే, విల్ యంగ్ రెండో వికెట్‌కు 44 పరుగులు జోడించారు.


ఆ తర్వాత న్యూజిలాండ్‌ను మరో జోడీ ఆదుకుంది. డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర (65: 105 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) భారత బౌలర్లను చాలా సేపు ఇబ్బంది పెట్టారు. వీరు దాదాపు 20 ఓవర్ల పాటు క్రీజులో నిలబడ్డారు. మూడో వికెట్‌కు వీరు 62 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే డెవాన్ కాన్వే అర్థ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ జోడీ ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో మళ్లీ అశ్వినే న్యూజిలాండ్‌ను దెబ్బ తీశాడు. క్రీజులో పాతుకుపోయిన డెవాన్ కాన్వేను అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. దీంతో న్యూజిలాండ్ 138 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.



విజృంభించిన వాషింగ్టన్...
డెవాన్ కాన్వే అవుట్ అవ్వగానే క్రీజులోకి డేరిల్ మిషెల్ (18: 54 బంతుల్లో) వచ్చాడు. త్వరగా మూడు వికెట్లు పడిపోయాయి కాబట్టి డేరిల్ మిషెల్ చాలా నింపాదిగా ఆడాడు. ముఖ్యంగా న్యూజిలాండ్‌కు డేంజర్‌గా మారిన అశ్విన్‌ను రచిన్ రవీంద్ర, డేరిల్ మిషెల్ చాలా జాగ్రత్తగా ఆడారు. తన బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడుతూ మరో ఎండ్‌లో బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ స్ట్రాటజీతోనే నాలుగో వికెట్‌కు 59 పరుగులు జోడించారు. కానీ వారికి అనుకోని ప్రమాదం ఎదురైంది. ఆ ప్రమాదం పేరు వాషింగ్టన్ సుందర్.


ముందుగా క్రీజులో కుదురుకున్న రచిన్ రవీంద్రను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ బాట పట్టించాడు వాషింగ్టన్ సుందర్. తర్వాత వచ్చిన న్యూజిలాండ్ బ్యాటర్లలో ఎవ్వరినీ క్రీజులో కుదురుకోనివ్వలేదు. ఒక్క మిషెల్ శాంట్నర్ (33: 51 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) మాత్రమే వాషింగ్టన్ వేవ్‌లో కాసేపు నిలబడ్డాడు. డేరిల్ మిషెల్ తర్వాత దిగిన వారిలో మిషెల్ శాంట్నర్ తప్ప ఎవరూ రెండంకెల స్కోరు కూడా చేయనివ్వలేదు. దీంతో న్యూజిలాండ్ 79.1 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ ఏడు వికెట్లు తీయగా... అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్ ఎంత అద్భుతంగా బౌలింగ్ చేశాడంటే తను తీసిన ఏడు వికెట్లలో ఐదు క్లీన్ బౌల్డ్‌లే. మిగతా రెండిట్లో ఒకటి ఎల్బీడబ్ల్యూ కాగా... మరొకటి క్యాచ్ అవుట్.


రోహిత్ శర్మ డకౌట్...
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ (0: 9 బంతుల్లో) ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే పెవిలియన్ బాట పట్టాడు. టిమ్ సౌతీ రోహిత్ శర్మను క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం శుభ్‌మన్ గిల్ (10 బ్యాటింగ్: 32 బంతుల్లో, ఒక ఫోర్), యశస్వి జైస్వాల్ (6 బ్యాటింగ్: 25 బంతుల్లో, ఒక ఫోర్) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు.