Shramila countered Jagans comments on family issues: వైసీపీ అధినేత  జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఆస్తుల వ్యహారాలు మీడియాకు ఎక్కాయి. జగన్మోహన్ రెడ్డి తన తల్లి, చెల్లిపై  నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ లో పిటిషన్లు వేసినట్లుగా బయటకు తెలియడంతో సంచలనం అయింది. ఈ అంశంపై జగన్ విజయనగరంలో స్పందించారు. అన్ని ఇళ్లల్లో ఉన్నట్లే తమ ఇంట్లో కూడా ఆస్తుల గొడవలు ఉన్నాయన్నారు. దీనికి ప్రాధాన్యత ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, జగన్ సోదరి షర్మిల స్పందించారు. విజయవాడలో పార్టీ కార్యాలయంలో జిల్లాల వారీగా పార్టీ నేతలతో ఆమె సమీక్షలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ టీవీ చానల్‌తో మాట్లాడారు. 


షర్మిల, జగన్ మధ్య ఆస్తుల పంచాయతీ               


కుటుంబంలో సమస్యలు ఉండడం సహజమేకానీ అందరూ  అమ్మల మీద, చెల్లెళ్ల మీద  కోర్ట్ ల్లో కేసులు వేయరు  కదా?.. ఇలా కోర్టుకు లాగరు కదా? అని కౌంటర్ ఇచ్చారు. సొంత తల్లి, చెల్లితో సరస్వతి పవర్ అనే కంపెనీలో షేర్ల అంశాన్ని తేల్చుకునేందుకు జగన్ కంపెనీ లా ట్రిబ్యునల్ కు వెళ్లడంతో ఇంత కాలం బయటకు తెలియని అన్నాచెల్లెళ్ల ఆస్తుల పంచాయతీ వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత జగన్‌తో పాటు షర్మిల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా మీడియాలోకి వచ్చాయి. జగన్ అధికారికంగా షర్మిలకు లేఖ రాశారు. రాజకీయాల నుంచి విరమించుకోవాలి అలా అయితేనే తాను ఎంవోయూ చేసిన ఆస్తిని రాసిస్తానని అందులో స్పష్టం చేశారు. 


విజయనగరంలో అలిగిన జగన్ - మాట్లాడకుండా వెళ్లిపోతానని బెదిరింపు - అలాగే చేశారు కూడా !


తండ్రి మాటలను జగన్ ఉల్లంఘించారని షర్మిల ఆరోపణలు        


దానికి ప్రతిగా షర్మిల కూడా లేఖ రాశారు. కుటుంబ వనరుల ద్వారా సంపాదించిన  మొత్తాన్ని నలుగురు మనవలు, మనవరాళ్లకు చెందేలా తండ్రి వైఎస్ ఉన్నప్పుడే అంగీకరించారని దానికి తల్లి విజయమ్మే సాక్ష్యంగా ఉన్నారని  గుర్తు చేశారు. తండ్రి చనిపోయిన తర్వాత జగన్ మాట మార్చారని ఆరోపించారు. అనేక ఆస్తుల విషయంలో అన్యాయం చేసినా కుటుంబబంధాల కోసం తాను పెద్దగా మాట్లాడలేదని కానీ ఇచ్చిన ఆస్తుల్ని కూడా వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని  షర్మిల ఆరోపిస్తున్నారు.       


కుటుంబ విషయాలపై ప్రచారం వద్దంటున్న జగన్                 


జగన్ రాసిన లేఖలో తాను ఆస్తులు పంచివ్వడమే కాకుండా వివిధ సందర్భాల్లో మొత్తం రూ. రెండు వందల కోట్ల వరకూ ఇచ్చానని జగన్ చెప్పడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారాలన్నీ ఏపీలో చర్చనీయాంశమవుతున్నాయి. అందుకే విజయనగరం పర్యటనలో జగన్ అన్ని ఇళ్లల్లో ఉన్నట్లే తన ఇంట్లో ఉన్నాయని దీన్ని హైలెట్ చేయాల్సిన అవసరం లేదని మీడియాకు చెబుతున్నారు. అయితే షర్మిల మాత్రం అందరూ జగన్ లాగా కోర్టుకెళ్లరు కదా అని కౌంటర్ ఇచ్చారు.