Kishan Reddy met with BJP leaders in Vijayawada : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయవాడలో ఒక రోజు పాటు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అధికారిక కార్యక్రమాలు లేకపోయినా పార్టీ వ్యవహారాల కోసమే ఆయన విజయవాడ వచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత  పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. 


కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ బీజేపీలో కార్యకలాపాలు తగ్గిపోయాయి. కూటమిలో భాగంగా ఉండటంతో ఏ పని చేయలేకపోతున్నారు. సీనియర్ నేతలంతా సైలెంట్ గా ఉండిపోయారు. వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. కూటమి విజయం కోసం పని చేసినా .. తర్వాత రాష్ట్రంలో పెద్దగా వారిని ఉపయోగించుకునే ప్రయత్నాలు కూడా జరగడం లేదు. పార్టీ పరమైన కార్యకలాపాలు కూడా తగ్గిపోయిాయి. సభ్యత్వ కార్యక్రమాలను లీడర్లు ఎవరూ సీరియస్ గా తీసుకోలేదని చెబుతున్నారు. వివిధ కారణాలతో అనుకున్న విధంగా ముందుకు సాగడం లేదు. 


సీనియర్ నేతలకు యాక్టివ్ గా ఉండే బాధ్యతలు లేకపోవడం కూడా పార్టీ ఇనాక్టివ్ గా ఉందని భావించడానికి ఓ కారణంగా మారింది.  పార్టీ హైకమాండ్ మాత్రం ఇతర రాష్ట్రాల్లో వారిని ఎన్నికల ప్రచారానికి పంపిస్తోంది. మహారాష్ట్రకు పరిశీలకులుగా విష్ణువర్ధన్ రెడ్డితో పాటు మాధవ్, మధుకర్‌లను పంపింది. వారు అక్కడ పరిశీలకులుగా పార్టీ విజయం కోసం పని చేస్తున్నారు.  



పార్టీ భాగంగా ఉన్న కూటమి అధికారంలోకి రావడంతో ఇప్పుడు పనితీరు భిన్నంగా ఉండాల్సి ఉంది. అందుకే పార్టీ నాయకత్వంలో మార్పులు చేయాలనుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. ఇటీవల బీజేపీ చాలా రాష్ట్రాల్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుల్ని మార్చే కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల అధ్యక్షులను కూడా మార్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అందులో భాగంగా కిషన్ రెడ్డి .. పార్టీ నేతల అభిప్రాయాలను తెలుసుకునేందుకు విజయవాడకు పంపించారా  అన్న చర్చ కూడా జరుగుతోంది.  


జాతీయ పార్టీగా  బీజేపీ మరింత యాక్టివ్ గా ఉండాలన్న ఆలోచనలో కేంద్ర పెద్దలు ఉన్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి.. కూటమితో కలిసి ఎలా ముందుకెళ్లాలి.. పార్టీ కోసం పని చేసిన వారికి ఎలాంటి పదువులు కేటాయించాలి అన్న అంశాలపైనా కిషన్ రెడ్డి పార్టీ నేతలతో మాట్లాడినట్లుగా తెలుస్తోంది.