Central Government Funds To Roads Development In AP: కేంద్ర ప్రభుత్వం ఏపీకి మరో గుడ్ న్యూస్ అందించింది. రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితన్ గడ్కరీ ట్విట్టర్ వేదికగా గురువారం కీలక ప్రకటన చేశారు. రూ.252.42 కోట్ల విలువైన రహదారి పనులకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఇందులో రణస్థలం నుంచి శ్రీకాకుళం వరకూ ఆరులైన్ల ఎలివేటెడ్ కారిడార్ అభివృద్ధి, ఆధునికీకరణ గురించి కూడా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల పలు చోట్ల ట్రాఫిక్ సమస్యలు తీరడం సహా రహదారి భద్రత పెరుగుతుందని గడ్కరీ తెలిపారు. అలాగే, ఆర్థిక, సామాజిక అవకాశాలు పెరుగుతాయని అన్నారు. ఈ ప్రాజెక్టుతో చాలామందికి ఉపాధి కూడా లభిస్తుందని.. తద్వారా ఈ ప్రాంతానికి చెందిన వారి జీవితాలు సైతం మెరుగుపడతాయని పేర్కొన్నారు.






4 గ్రీన్ ఫీల్డ్ రహదారులు


రూ.43,500 కోట్లతో 4 గ్రీన్ ఫీల్డ్ రహదారుల నిర్మాణం జరగనుందని, 6 ప్రాజెక్టులు బిడ్డింగ్ దశలో ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. 15 ప్రాజెక్టులు నిలిచిపోయాయని, 75 ప్రాజెక్టులకు భూ సేకరణ సమస్యలు, 23 ప్రాజెక్టులకు అటవీ అనుమతలు సమస్యలు ఉన్నాయని చెప్పారు. మొత్తం 95 ప్రాజెక్టులకు వివిధ సమస్యలు ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో చేపట్టబోయే ప్రాజెక్టులన్నింటికీ 3 నెలల్లో భూసేకరణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 'బెంగుళూరు - కడప - విజయవాడ ఎక్స్‌ప్రెస్ వేకు సమస్యలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు 15 రోజుల్లో పర్యావరణ అనుమతులు సాధించాలి. రెండున్నరేళ్లలో రూ.50 వేల కోట్లతో పనులు పూర్తి చేయాల్సి ఉంది. హైదరాబాద్ నుంచి మచిలీపట్నానికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్‌వే నిర్మాణం జరగనుంది. ఎకో గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా ఏపీ మారనుంది. ఆక్వా, హార్టికల్చర్ ఎగుమతులకు అవకాశాలు ఉన్నాయి.' అని చంద్రబాబు పేర్కొన్నారు.


అమరావతికి రైల్వే లైన్






మరోవైపు, అమరావతి రైల్వే లైన్‌కు గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతికి రూ.2,245 కోట్లతో 57 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మించనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) ప్రకటించారు. హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా సహా దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో రాజధాని అమరావతిని కలుపుతూ కొత్త రైల్వే ప్రాజెక్టు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కొత్త లైన్ నిర్మించనున్నట్లు చెప్పారు. మధ్య, ఈశాన్య భారతాన్ని దక్షిణ భారతదేశానికి అనుసంధానాన్ని మరింత మెరుగుపరచేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నదిపై 3 కిలోమీటర్ల పొడవైన వంతెనను నిర్మించనున్నారు. 


Also Read: YS Jagan : విజయనగరంలో అలిగిన జగన్ - మాట్లాడకుండా వెళ్లిపోతానని బెదిరింపు - అలాగే చేశారు కూడా !