Amaravati Railway Line: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. అమరావతి రైల్వే లైన్‌కు (Amaravati Railway Line)  కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) గురువారం వివరాలు వెల్లడించారు. అమరావతికి రూ.2,245 కోట్లతో 57 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మించనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా సహా దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో రాజధాని అమరావతిని కలుపుతూ కొత్త రైల్వే ప్రాజెక్టు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కొత్త లైన్ నిర్మించనున్నట్లు చెప్పారు. మధ్య, ఈశాన్య భారతాన్ని దక్షిణ భారతదేశానికి అనుసంధానాన్ని మరింత మెరుగుపరచేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నదిపై 3 కిలోమీటర్ల పొడవైన వంతెనను నిర్మించనున్నారు. 






ఈ రైల్వే లైన్‌తో అమరావతి స్తూపం, ఉండవల్లి గుహలు, అమరలింగేశ్వరస్వామి ఆలయం, ధ్యానబుద్ధ ప్రాజెక్టుకు వెళ్లే వారికి సులువైన మార్గంగా అభివృద్ధి చేయనున్నారు. మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులను అనుసంధానిస్తూ ఈ రైల్వే లైన్ ఏర్పాటు కానుంది. ఈ రైల్వే లైన్ నిర్మాణం ద్వారా 19 లక్షల పని దినాల కల్పన జరుగుతుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అలాగే, 25 లక్షల చెట్లు నాటుతూ కాలుష్య నివారణకు కూడా చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు.


'రూ.6,789 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం'


తెలంగాణలోని ఖమ్మం జిల్లా, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ, గుంటూరు జిల్లాల్లో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. మొత్తం రూ.6,789 కోట్ల రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఏపీ, తెలంగాణ, బీహార్ రాష్ట్రాల్లోని 8 జిల్లాలను కవర్ చేసేలా 2 కీలక రైల్వే ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసినట్లు పేర్కొన్నారు. అమరావతి అనుసంధానానికి 57 కి.మీ, బీహార్‌లో 256 కి.మీ రెండు ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. 'కొత్త లైన్ ప్రతిపాదన ఏపీ ప్రతిపాదిత రాజధాని అమరావతికి ప్రత్యక్ష కనెక్టివిటీని అందిస్తుంది. పరిశ్రమలు నెలకొల్పడానికి, ప్రజల రవాణాకు మెరుగైన వ్యవస్థలా ఉపయోగపడుతుంది. బహుళ ట్రాకింగ్ ప్రతిపాదన కార్యకలాపాలను సులభతరం చేయడం సహా రద్దీని తగ్గిస్తుంది.' అని పేర్కొన్నారు.


అలాగే, అంతరిక్ష రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు IN-SPACe ఆధ్వర్యంలో రూ.1,000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఫండ్ దాదాపు 40 స్టార్టప్‌లకు తోడ్పాటు అందించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అంతర్జాతీయంగా పోటీ తత్వాన్ని బలోపేతం చేయడంతో పాటు ఆత్మనిర్భర్ భారత్‌కు మరింత ప్రోత్సహం కల్పించేలా ఈ నిధి ఉపయోగపడుతుంది.


Also Read: Nara Lokesh and MohanDas Pai : బెంగళూరు నుంచి ఏపీకి రావాలని లోకేష్ పిలుపు - ఇంకా గ్రౌండ్ వర్క్ చేయాలన్న పారిశ్రామికవేత్త