Tips For Buying Gold Jewellery On Dhanteras: భారతీయ పండుగల్లో ధన్‌తేరస్ ప్రత్యేకం. బంగారంలో పెట్టుబడికి గోల్డెన్ టైమ్‌గా దానిని పరిగణిస్తారు. పసిడిలో ఇన్వెస్ట్ చేయడానికి వివిధ మార్గాలు అందుబాటులో ఉన్నప్పటికీ, భౌతిక బంగారాన్ని కొనుగోలు చేయడమే ప్రజలకు అత్యంత ఇష్టమైన పద్ధతి. అయితే, స్వర్ణాభరాణాలు కొనుగోలు చేసే ముందు కొన్ని అంశాలు మీ మైండ్‌లో ఉండాలి. అప్పుడే బెస్ట్ వాల్యూ దక్కుతుంది, డబ్బు మిగులుతుంది.
నగల కొనుగోలు సమయంలో పాటించాల్సిన చిట్కాలు
స్వచ్ఛత & సర్టిఫికేషన్
పుత్తడి విలువ ఇతర అంశాలతోపాటు దాని స్వచ్ఛతపైనా ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, బంగారు ఆభరణాలు రెండు రకాల్లో అందుబాటులో ఉంటాయి - 22 క్యారెట్లు (91.6 శాతం స్వచ్ఛమైనవి), 24 క్యారెట్లు (99.9 శాతం స్వచ్ఛమైనవి). 22 కేరెట్ల గోల్డ్‌ను ఆభరణాల తయారీ కోసం; 24 కేరెట్ల హేమాన్ని బిస్కట్‌లు, నాణేలు, కడ్డీలు వంటివాటి తయారీ కోసం ఉపయోగిస్తారు. మీ పెట్టుబడి లక్ష్యాన్ని గుర్తుంచుకుని 22 కేరెట్ల (22K) లేదా 24 కేరెట్ల (24K) పసుపు లోహాన్ని కొనుగోలు చేయాలి. 24K ఎల్లో మెటల్‌కు దాని అధిక స్వచ్ఛత కారణంగా 22K కంటే ఎక్కువ రీసేల్ వాల్యూ ఉంటుంది. కొనే సమయంలో, బంగారు ఆభరణాలు లేదా కడ్డీలపై BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) హాల్‌మార్క్ ఉందో, లేదో చెక్ చేయండి. BIS హాల్‌మార్క్ అనేది బంగారం స్వచ్ఛతను ధృవీకరించే చిహ్నం.
22K, 24Kతోపాటు.. 18 క్యారెట్లు (18K), 16 క్యారెట్లు (16K), 14 క్యారెట్ల (14K) ఆభరణాలు కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. క్యారెట్లు తగ్గే కొద్దీ పసిడి స్వచ్ఛత కూడా తగ్గుతుంది.
మేకింగ్ ఛార్జీలు
ఆభరణాల తయారీకి అయ్యే శ్రమ తాలూకు ఖర్చు ఇది. నగల డిజైన్ ఆధారంగా ఈ ఛార్జీలు మారుతూ ఉంటాయి. ఉదాహరణకు, బంగారు నాణేలు లేదా కడ్డీలు ఆభరణాల కంటే తక్కువ మేకింగ్ ఛార్జీలను కలిగి ఉంటాయి. కాబట్టి, నగలపై ఎక్కడ తక్కువ మేకింగ్ ఛార్జీలు ఉన్నాయో ముందే చూసుకోవడం వల్ల డబ్బు మిగులుతుంది.
చేతితో తయారు చేసిన Vs మెషీన్ తయారీ ఆభరణాలు
చేతితో తయారు చేసిన వాటితో పోలిస్తే మెషీన్ తయారీ నగలపై తక్కువ మేకింగ్ ఛార్జీలు ఉంటాయి. అయితే, నగ డిజైన్‌ను బట్టి ఈ ఛార్జీ మారుతుంది.
ధరలు - ఆఫర్లు
గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్ ఆధారంగా బంగారం ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. కాబట్టి, కొనుగోలు చేసే ముందు ధరల గురించి వాకబు చేయడం చాలా ముఖ్యం. కొంతమంది వర్తకులు ప్రైస్ లాక్ (price lock) ఫీచర్‌ను అందిస్తున్నారు. అంటే, భవిష్యత్ కొనుగోళ్ల కోసం ఈ రోజే ధరను లాక్ చేయడం. చాలా మంది వ్యాపారులు కస్టమర్లను ఆకర్షించడానికి డిస్కౌంట్లు, ఆఫర్లు, మేకింగ్ ఛార్జీల మాఫీ వంటివి ప్రకటిస్తారు. కొనుగోలు ప్రయోజనం పొందేందుకు అలాంటి ఆఫర్ల గురించి తెలుసుకోండి.
బరువును ధృవీకరించుకోవాలి
బరువును బట్టి బంగారం రేటు నిర్ణయమవుతుంది. మెరిసే రాళ్లు, వజ్రాలు, పచ్చలు వంటివాటిని ఆభరణాలలో అమర్చినప్పుడు, అవి నగ మొత్తం బరువును పెంచుతాయి. ఆభరణాలు కొనే సమయంలో, రాళ్లు/రత్నాల బరువును తగ్గించడం మర్చిపోవద్దు. లేకుంటే వాటి బరువుకు కూడా ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తుంది.
బై బ్యాక్ ఆఫర్‌లు
బంగారాన్ని కొనే ముందే, వారి మార్పిడి లేదా బై-బ్యాక్ పాలసీ గురించి వ్యాపారస్తుడిని అడగండి. చాలా నగల కంపెనీలు మార్పిడి లేదా బై బ్యాక్ సమయంలో బంగారం విలువను తిరిగి ఇస్తున్నాయి. 'తరుగు' కింద చాలా తక్కువ మొత్తాన్ని తగ్గిస్తున్నాయి. 'తరుగు' ఎంత తక్కువగా ఉంటే కస్టమర్‌కు అంత బెనిఫిట్.
బంగారానికి బీమా
బంగారాన్ని ఇంట్లో పెట్టుకున్నప్పుడు దొంగతనం సహా ఇతర నష్టాల భయం ఉంటుంది. కొన్ని ఆభరణాల దుకాణాలు బంగారం కొనుగోలుపై 1-2 సంవత్సరాల బీమా కవరేజ్ అందిస్తున్నాయి. ఇలాంటి వాటి కోసం సెర్చ్ చేయండి.
ఇన్వాయిస్, డాక్యుమెంటేషన్
బ్రాండెడ్ షోరూమ్‌లోనే నగలు కొనడానికి ప్రాధాన్యత ఇవ్వండి. మర్చిపోకుండా బిల్లు/ఇన్‌వాయిస్ తీసుకోండి. దానిలో బంగారం స్వచ్ఛత, బరువు, మేకింగ్ ఛార్జీలు సహా ఇతర వివరాలు ఉండేలా చూసుకోండి. ఇది బంగారం కొనుగోలుకు రుజువుగా పనికొస్తుంది. మీరు భవిష్యత్తులో బంగారాన్ని తిరిగి విక్రయించాలనుకుంటే ఇది పనికొస్తుంది.
ఆఫ్-సీజన్ కొనుగోళ్లు
పండుగల సీజన్, పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం రేట్లు పెరుగుతాయి. ఖర్చు తగ్గించుకోవాలంటే ఆఫ్-సీజన్‌లో ఆభరణాలు కొనడం తెలివైన పని.
మరో ఆసక్తికర కథనం: 'గోల్డ్ రష్'కు ముగింపు ఎప్పుడు? - ఈ రోజు బిస్కట్ గోల్డ్, ఆర్నమెంట్ గోల్డ్, సిల్వర్ రేట్లివి