న్యూజిలాండ్ జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా వికెట్లతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత్ 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్ (62: 40 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యాన్ని దక్కించుకుంది. రెండో మ్యాచ్ గెలిస్తే.. సిరీస్ మన కైవసం అవుతుంది.
చివర్లో మెరిసిన బౌలర్లు
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మొదటి ఓవర్లోనే డేరిల్ మిషెల్‌ను(0: 1 బంతి) అవుట్ చేసి భువనేశ్వర్ కుమార్ టీమిండియాకు మంచి బ్రేక్ ఇచ్చాడు. అయితే ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన మార్క్ చాప్‌మన్ (63: 50 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు), మరో ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ (70: 42 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) ఆ ప్రభావం తమ మీద పడకుండా ఆడారు. దీంతో పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది.
వీరిద్దరినీ భారత బౌలర్లు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. ఇదే క్రమంలో 10 ఓవర్లలో జట్టు స్కోరు 65 పరుగులకు చేరింది. ఆ తర్వాత వీరిద్దరూ వేగం పెంచారు. ఇదే క్రమంలో ఇన్నింగ్స్ 12వ ఓవర్లో చాప్‌మన్ అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 14వ ఓవర్లో అశ్విన్ భారత్‌కు మళ్లీ మంచి బ్రేక్ ఇచ్చాడు. ఒకే ఓవర్లో చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్‌లను (0: 3 బంతుల్లో) అవుట్ చేశాడు.
వెంటనే ఇన్నింగ్స్ 15వ ఓవర్లో మార్టిన్ గుప్టిల్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తూ స్కోరు వేగం పెంచే క్రమంలో ఇన్నింగ్స్ 18వ ఓవర్లో అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ వేగంగా ఆడలేకపోవడంతో 20 ఓవర్లలో న్యూజిలాండ్ ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో భువనేశ్వర్, అశ్విన్ రెండేసి వికెట్లు తీశారు. దీపక్ చాహర్, సిరాజ్‌లకు చెరో వికెట్ దక్కింది.
ఆఖర్లో తడబడినా..
165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభం లభించింది. కేఎల్ రాహుల్ (15: 14 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), రోహిత్ శర్మ (48: 35 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) మొదటి వికెట్‌కు 50 పరుగులు జోడించారు. ఆ తర్వాత రాహుల్ అవుటైనా సూర్యకుమార్ యాదవ్ (62: 40 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు), రోహిత్ కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టానికి 85 పరుగులు చేసింది.
రెండో వికెట్‌కు 59 పరుగులు జోడించిన అనంతరం ట్రెంట్ బౌల్ట్.. కెప్టెన్ రోహిత్‌ను అవుట్ చేసి న్యూజిలాండ్‌కు మరో బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత అర్థ సెంచరీ పూర్తి చేసుకుని జట్టును విజయానికి చేరువ చేసిన సూర్యకుమార్ కూడా అవుటయ్యాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ కాస్త నెమ్మదించినా.. చివర్లో రిషబ్ పంత్ (17 నాటౌట్: 17 బంతుల్లో, రెండు ఫోర్లు) కొంచెం బాగా ఆడటంతో భారత్ 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీయగా.. సౌతీ, శాంట్నర్, మిషెల్ తలో వికెట్ తీశారు.
Also Read: Uganda: ఉగాండాలో వరుస పేలుళ్లు.. భారత జట్టు సేఫ్.. ఈ వీడియోలు చూశారా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి