IND Vs ENG: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌లో మొదటి రెండు టెస్టులకు అందుబాటులో ఉండటం లేదు. వ్యక్తిగత కారణాల రీత్యా విరాట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. ఈ విషయమై విరాట్ కోహ్లీ... కెప్టెన్ రోహిత్ శర్మ, జట్టు మేనేజ్‌మెంట్, సెలక్టర్లతో మాట్లాడాడు.


దేశానికి ప్రాతినిధ్యం వహించడం తనకు ప్రథమ ప్రాధాన్యత అయినప్పటికీ, కొన్ని వ్యక్తిగత కార్యక్రమాల్లో తను ఉండటం తప్పనిసరి కావడం వల్ల ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని వివరించాడు. అతని నిర్ణయానికి బీసీసీఐ గౌరవం ఇచ్చింది. అలాగే విరాట్ కోహ్లీకి మద్దతుగా కూడా బీసీసీఐ నిలుస్తామని తెలిపింది. మిగతా జట్టు సభ్యులపై కూడా నమ్మకం ఉందని, వారు ఈ సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తారని తమకు నమ్మకం ఉందని పేర్కొన్నారు.






అలాగే విరాట్ కోహ్లీ ప్రైవసీకి భంగం కలిగించవద్దని బీసీసీఐ మీడియాను, ఫ్యాన్స్‌ను కోరింది. అభిమానులు అందరి ఫోకస్ భారత క్రికెట్ జట్టుకు మద్దతు ఇవ్వడంపైనే ఉండాలని బీసీసీఐ అభ్యర్థించింది. అభిమానులు సపోర్ట్ చేస్తే భారత ఆటగాళ్లు సవాళ్లను అధిగమిస్తారని పేర్కొన్నారు. విరాట్ కోహ్లీ స్థానంలో ఎవరు ఆడతారో తాము త్వరలో ప్రకటిస్తామన్నారు.


ప్రపంచ టెస్టు ఛాంపియన్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో తొలి టెస్టు గురువారం నుంచి జరగనుంది. దీంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు (Hyderabad) వచ్చేశారు. అబుదాబిలో దాదాపు నెల రోజుల క్యాంపు తర్వాత బ్రిటిష్ జట్టు నేరుగా హైదరాబాద్‌కు వచ్చేసింది. శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టిన ఇంగ్లండ్ ఆటగాళ్లకు భారతీయ సంప్రదాయ పద్దతిలో ఘన స్వాగతం లభించింది. ఆటగాళ్లను చూడడానికి అభిమానులు ఉత్సాహం చూపించారు. ఈ వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (England Cricket board) ఎక్స్/ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. హలో హైదరాబాద్.. ఇది ముత్యాల నగరం అంటూ పోస్ట్‌కు క్యాప్షన్ పెట్టింది.


భారత్‌, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 25వ తేదీ నుంచి హైదరాబాద్‌లోని ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో అబుదాబిలో దాదాపు నెల రోజుల క్యాంపు అనంతరం ఇంగ్లండ్ జట్టు భారత్‌కు వచ్చేసింది. ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండానే నేరుగా భారత్ టెస్టు సిరీస్ బరిలోకి దిగనుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో అడుగుపెట్టిన భారత జట్టు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో విజయం సాధించాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది.


హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌కు 25 వేల మంది స్కూల్‌ విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. తెలంగాణ‌లో ప‌ని చేస్తున్న ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది కుటుంబాల‌ను రిప‌బ్లిక్ డే రోజున ఉచితంగా అనుమ‌తించాలని హెచ్‌సీఏ నిర్ణయం తీసుకుంది.