దేశమంతా రామ నామస్మరణతో మారు మ్రోగుతోంది. అయోధ్యలో రామమందిర (Ayodhya Ram Mandir) ప్రాణప్రతిష్ఠ సందర్భంగా పలువురు ప్రముఖులు అయోధ్యకు తరలి వెళ్ళగా అవకాశం లేనివారు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వెల్లడిస్తున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి పలువురు ఆటగాళ్లకు కూడా ఆహ్వానాలు అందాయి. విదేశీ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు భారత సంతతి ఆటగాళ్లూ ఈ వేడుకపై స్పందించారు. ఈ నేపధ్యంలో దక్షిణాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహరాజ్(Keshav Maharaj) సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశాడు. ఈ అద్భుతమైన రోజు ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండిపోతుందని, దేశ వ్యాప్తంగానే కాకుండా దక్షిణాఫ్రికాలోని భారత సంతతి ప్రజలకు కూడా శుభాకాంక్షలు చెబుతున్నానన్నారు. రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ ఘనంగా జరగాలని కోరుకుంటున్నానన్నారు . అందరిలోనూ శాంతి, సామరస్యం, ఆధ్యాత్మిక జ్ఞానోదయం తీసుకురావాలని కోరుకుంటున్నానన్నారు.
పూర్వీకులు భారతీయులే...
కేశవ్ పూర్వీకులు భారత్ నుంచి ఉపాధి నిమిత్తం దక్షిణాఫ్రికాకు వలస వెళ్లారు. కేశవ్ తండ్రి ఆత్మానందం కూడా క్రికెట్ ఆడినా వర్ణవివక్ష కారణంగా ఎదగలేకపోయాడు. తొలి నాళ్లలో సీమ్ బౌలర్, ఆల్‌రౌండర్ అయిన కేశవ్.. తర్వాత స్పిన్నర్ అవతారం ఎత్తాడు. 2016లో ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి ఆరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే స్మిత్‌ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. తర్వాత టీ20ల్లోకి అడుగుపెడుతూనే సౌతాఫ్రికాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కేశవ్ దక్షిణాఫ్రికాలోనే పుట్టిపెరిగినప్పటికీ.. హిందూ సంప్రదాయాలను పాటిస్తాడు. హనుమాన్ భక్తుడైన అతడి బ్యాట్‌పై ఓం గుర్తు ఉంటుంది. అతడి భార్య లెరీసాకు కూడా భారత మూలాలు ఉన్నాయి. ఆమె కథక్ డ్యాన్సర్ కూడా. టెస్టుల్లో కేశవ్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో శ్రీరాముని పాటలు వినిపించాయి. అప్పుడు కేశవ్ స్పందిస్తూ.. తాను ఎప్పుడు మైదానంలోకి దిగినా ఇలాంటి పాటలు వినిపించేలా చేశారని ఆనందం వ్యక్తం చేశాడు.
రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అయోధ్య సిద్ధమైంది. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. ప్రధాని
నరేంద్ర మోదీ కూడా అయోధ్యకు తరలి వచ్చారు. ఇప్పటికే, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ , కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, సినీ నటులు రజినీకాంత్, అలీయా భట్, రణబీర్‌కపూర్, జాకీ ష్రాఫ్, మాధురీ దీక్షిత్, కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ దంపతులు, అనుపమ్ ఖేర్... కైలాష్ ఖేర్, హేమ మాలిని ఇప్పటికే అయోధ్య రామాలయానికి చేరుకున్నారు. అయోధ్య రామాలయానికి వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ పరిసరాలను … భక్తులకు కల్పించిన సౌకర్యాలను తనిఖీ చేశారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ కూడా అయోధ్య ఆలయానికి చేరుకున్నారు.
నటి కంగనా రనౌత్ , వివేక్ ఒబెరాయ్ రామజన్మ స్థలానికి చేరుకున్నారు. ప్రముఖ గాయకుడు శంకర్ మహాదేవన్ , మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే .. బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ , యోగు గురు బాబా రాందేవ్ అయోధ్య వచ్చారు. మాజీ ప్రధానమంత్రి హెచ్.డి. దేవేగౌడ అయోధ్య రామలయానికి చేరుకున్నారు. మాజీ క్రికెటర్లు సచిన్ తెండూల్కర్, అనిల్ కుంబ్లే, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ , వెంకటేష్ ప్రసాద్..మిథాలీ రాజ్, పిటి ఉష, ఈ మహా క్రతువులో పాల్గొన్నారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సాంప్రదాయ దుస్తుల్లో ఈ మహా వేడుకకు హాజరవ్వగా... అభిమానులు సెల్ఫీల కోసం క్యూ కట్టారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి 7వేలమందిని ఆహ్వానించగా అందులో 506మంది లిస్ట్ -ఏలో ఉన్నారు. ఇందులో ప్రముఖ రాజకీయ నేతలతోపాటు దిగ్గజ పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, దౌత్యవేత్తలు, న్యాయమూర్తులు, పూజారులు ఉన్నారు.