భారత పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ కొట్టాడు. అదేంటీ, ఆతిథ్య ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులో కోహ్లీ 7 పరుగులే కదా సాధించింది. మరి, హాఫ్ సెంచరీ ఎప్పుడు సాధించాడా అని కదా మీ సందేహం. 






అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ శతకం సాధించక 50 ఇన్నింగ్స్‌లు పూర్తయ్యాయి. టెస్టు, వన్డే, T20 ఈ మూడు ఫార్మాట్లల్లోనూ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించక ఇప్పటికి 50 ఇన్నింగ్స్‌లు పూర్తయ్యాయి. 2019 నవంబరులో చివరిసారి కోహ్లీ శతకం సాధించాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు అతడు సెంచరీ సాధించలేదు. కోహ్లీ శతకం చేస్తే చూడాలని ఎంతో అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.






లార్డ్స్ టెస్టులో అతడి నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించారు. కానీ, కోహ్లీ నిరాశపరిచాడు. తాజాగా లీడ్స్‌లో కోహ్లీ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించారు. కానీ, తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 7 పరుగులకే అండర్సన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 






దీంతో విరాట్ కోహ్లీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. కోహ్లీ మ్యాచ్లో 50 లేదా 100 సాధించకపోయినా... మరో రకంగా అతడు తన ఖాతాలో 50 వేసుకున్నాడని కామెంట్లు చేస్తున్నారు. కోహ్లీ ఇక ఆడింది చాలు రిటైరైపో అని మరికొందరు అంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ శతకం సాధించడం ఇక కలగానే మిగిలిపోతుందేమో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.