IND Vs BAN 1st T20I Highlights: బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించింది. మొదటి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత జట్టు కేవలం 11.5 ఓవర్లలోనే మూడు వికెట్లు నష్టపోయి టార్గెట్ ఛేజ్ చేసింది. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన హార్దిక్ పాండ్యా (39 నాటౌట్: 16 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) టీమిండియా బ్యాటర్లలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.


విధ్వంసం చేసిన భారత బ్యాటర్లు...


128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. అభిషేక్ శర్మ కేవలం ఏడు బంతుల్లోనే 16 పరుగులు చేసి దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు. మరో ఓపెనర్ సంజు శామ్సన్ (29: 19 బంతుల్లో, ఆరు ఫోర్లు) కూడా క్రీజులో ఉన్నంత సేపు వేగంగా ఆడాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (29: 14 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) కూడా ఆడినంత సేపు బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.


వీరిద్దరి తర్వాత క్రీజులోకి వచ్చిన వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వీరిద్దరినీ మించి వేగంగా ఆడాడు. అతనికి నితీష్ కుమార్ రెడ్డి (16: 15 బంతుల్లో, ఒక సిక్సర్) చక్కటి సహకారం అందించారు. దీంతో టీమిండియా కేవలం 11.5 ఓవర్లలోనే మూడు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్, మెహదీ హసన్ మిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.



బంగ్లాదేశ్ తుది జట్టు
లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), పర్వేజ్ హుస్సేన్ ఎమాన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకీర్ అలీ, మెహదీ హసన్ మిరాజ్, రిషద్ హొస్సేన్, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షోరిఫుల్ ఇస్లామ్


భారత్ తుది జట్టు
అభిషేక్ శర్మ, సంజు శామ్సన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్ 



Read Also: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన బుమ్రా, అశ్విన్ - తొలి 2 స్థానాలు భారత బౌలర్లవే