Babar Azam Resign As Pakistan Captain:

మళ్లీ అదే ప్రకటన... మళ్లీ పాక్ క్రికెట్‌(Pakistan Cricket)లో అదే సంక్షోభం.. క్రికెట్‌ ప్రపంచంలో పాక్ క్రికెట్‌ బోర్డులో జరిగినన్నీ ఘటనలు మరే క్రికెట్ బోర్డులోనూ జరగవు. పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం(Babar Azam) రెండోసారి కీలక ప్రకటన చేశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్టు సంచలన ప్రకటన చేశాడు. పాకిస్థాన్‌ క్రికెట్ సంక్షోభం కొనసాగుతోంది. అసలే ఆటలో నాణ్యత ప్రమాణాలు పాతాళానికి పడిపోయి ఒక్క విజయం దక్కడమే గగనమైపోయిన వేళ...పాక్‌లో రాజీనామాలు  కలకలం రేపుతున్నాయి. గతంలో భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత తన కెప్టెన్సీకి రాజీనామా చేసి... తర్వాతి పరిణామాలతో మళ్లీ పగ్గాలు అందుకున్న బాబర్ ఆజమ్.. మళ్లీ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు.  పాక్ సెలెక్టర్ పదవికి మహ్మద్ యూసుఫ్ రాజీనామా చేసిన వారం రోజుల్లోపే బాబర్ కూడా కెప్టెన్సీకి గుడ్ బై  చెప్పడం కలకలం రేపుతోంది. 

 


 

క్రికెట్ సంక్షోభాలన్నీ పాక్‌లోనే..

పాకిస్థాన్ కెప్టెన్సీకి రెండోసారి బాబర్‌ ఆజమ్ రాజీనామా చేశాడు. పాకిస్థాన్ వన్డే, టీ20లకు కెప్టెన్‌గా ఉన్న బాబర్‌.. మళ్లీ సారథ్య బాధ్యతలను త్యజించాడు. ఇంతకు ముందు కూడా ఒకసారి రాజీనామా చేసిన బాబర్.. మళ్లీ సారథ్య పగ్గాలు చేపట్టాడు. అయితే ఈసారి బాబర్ 'పని భారం' కారణంగా పాకిస్థాన్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టేందుకే తాను కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు బాబర్ తెలిపాడు. "ప్రియమైన అభిమానులారా, నేను ఈ రోజు మీతో ఓ విషయం పంచుకుంటున్నాను. నేను పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. గత నెలలోనే ఈ విషయాన్ని PCB, టీమ్ మేనేజ్‌మెంట్‌కు   చెప్పాను. ఈ జట్టుకు సారథ్యం వహించడం చాలా గొప్ప గౌరవం. కానీ ఇప్పుడు ఈ సారథ్యం నుంచి వైదొలిగి,  బ్యాటింగ్‌పై పూర్తి దృష్టి కేంద్రీకరించాల్సిన సమయం ఆసన్నమైంది. నాకు కెప్టెన్సీ ఒక బహుమానం. అద్భుతమైన అనుభవం. కానీ ఇది నాపై గణనీయమైన పనిభారాన్ని పెంచుతోంది. అందుకే కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నా" అని బాబర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 





 

బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకేనా..

 బ్యాటింగ్‌పై మరింత ఎక్కువ దృష్టి పెట్టేందుకే కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతున్నట్లు బాబర్ స్పష్టం చేసినా... దీనికి జట్టులో బాబర్ పై వ్యతిరేకత కూడా కారణమని తెలుస్తోంది. కుటుంబంతో సమయం గడిపేందుకు కూడా తాను కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు బాబర్ తెలిపాడు. ఏడాదిలోపే మళ్లీ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఏడాది వ్యవధిలో బాబర్ ఆజం కెప్టెన్సీకి రాజీనామా చేయడం ఇది రెండోసారి. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడు. ODI ప్రపంచ కప్ తర్వాత, బాబర్ నవంబర్ 15, 2023 న కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు.