అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్‌ఖాన్ తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. భారీ భూకంపంతో అతలాకుతలమైన తన దేశానికి తనకు చేతనైన సాయం చేసి అందరి మనసులు దోచుకున్నాడు. తమదేశంలో భూకంపం ధాటికి ఆత్మీయులను, సర్వస్వాన్ని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మునిగిన ప్రజలను చూసి చలించిన రషీద్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. బంతిని గింగిరాలు తిప్పుతూ ప్రత్యర్థులను ముప్పుతిప్పులు పెట్టే ఈ స్టార్ స్పిన్నర్... తన ప్రపంచకప్ ఫీజు మొత్తాన్ని భూకంప బాధితులకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించాడు. అఫ్గానిస్థాన్‌లోని పశ్చిమ ప్రావిన్సుల్లో భూకంపం తనను కలచివేసిందని ట్విట్టర్ పోస్ట్‌లో రషీద్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రపంచ కప్ 2023లో తన మ్యాచ్ ఫీజు మొత్తాన్ని కష్టాల్లో ఉన్న ప్రజలకు సహాయం చేస్తున్నట్లు ప్రకటించాడు.
ఈ ఘోర ప్రకృతి విపత్తు కారణంగా రోడ్డున పడినవాళ్లను ఆదుకునేందుకు త్వరలోనే నిధులు సేకరణ చేపడతానని రషీద్ పేర్కొన్నాడు. భూకంప బాధితులను ఆదుకునేందుకు డబ్బును సేకరించేందుకు త్వరలో ప్రచారాన్ని ప్రారంభిస్తానని తెలిపాడు. కష్టాల్లో ఉన్న తన దేశ ప్రజలకు అండగా నిలిచేందుకు మరికొందరితో కలిసి త్వరలోనే నిధులు సేకరిస్తా అని రషీద్ ట్వీట్ చేశాడు. రషీద్ మంచి నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
భూకంపం ధాటికి అతలాకుతలం
టర్కీ భూకంపాన్ని మర్చిపోకముందే పశ్చిమ అఫ్గానిస్థాన్‌లో సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని నింపింది. ఈ ప్రకృతి విపత్తు ధాటికి ఇప్పటి వరకు మృతుల సంఖ్య 2 వేలు ధాటింది. వేలాది మందికి తీవ్ర గాయాలయ్యాయి. హెరాత్‌లో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ప్రకృతి విపత్తులో 2445 మంది మరణించగా... వేలాది మంది గాయాలపాలయ్యారని ఆ దేశం ప్రకటించింది. రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రతతో వరుస ప్రకంపనలతో హెరాత్ ప్రావిన్స్ అల్లాడిపోయింది. ఒక్కసారిగా వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేలాది నివాసితులు శిథిలాల కింద చిక్కుకొని ఉన్నారు. స్వచ్ఛంద సంస్థలతోపాటు, స్థానికులు కూడా సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకూ ప్రపంచ ఆరోగ్య సంస్థ అఫ్గాన్‌కు 10 అంబులెన్స్‌లు, వైద్య సామాగ్రి పంపించింది. 10వేల ప్రాథమిక చికిత్స కిట్లను, 5వేల కుటుంబాలకు అవసరమయ్యే సామాగ్రిని, 15వందల జతల బట్టలను, దుప్పట్లను ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్స్ ఫండ్ అందించింది. ఈ సమయంలో అన్ని దేశాలు కలిసి అఫ్గాన్‌కు అండగా నిలబడాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుట్టెరస్ పిలుపునిచ్చారు. మరిన్ని భూకంపాలు సంభవించే అవకాశం ఉండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఇళ్ల బయటే ఉంటున్నారు. అఫ్గాన్‌లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ 12 అంబులెన్సులు, అత్యవసర వైద్య సామాగ్రిని అందించింది.
ప్రపంచకప్‌లో ఇలా...
వన్డే ప్రపంచకప్ తొలి పోరులో అఫ్గానిస్థాన్ ఓడిపోయింది. ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గాన్ పరాయజం పాలైంది. బంగ్లా బౌలర్ల ధాటికి అఫ్గనిస్థాన్ 156 పరగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ ఆ తర్వాత ఎలాంటి తడబాటు లేకుండా లక్ష్యాన్ని ఛేదించింది. అఫ్ఘాన్ జట్టు అక్టోబర్ 11న ఢిల్లీలో భారత్‌తో తలపడనుంది.