భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది. దాయాదుల మధ్య పోరును మ్యాచ్‌ల కాకుండా ఓ యుద్ధంలా చూస్తారు. ద్వైపాక్షిక సిరీస్‌లోనే వీరిద్దరి పోరును చూసేందుకు క్రికెట్‌ ప్రేమికులు ఎగబడతారు. అలాంటిది ప్రపంచకప్‌లాంటి మెగా టోర్నీలో ఈ రెండు జట్లు తలపడితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పుడు అక్టోబర్ 14న  ప్రపంచకప్‌లో భారత్‌-పాక్ తలపడబోతున్నాయి. గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌పై అందరి కళ్లు కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ మ్యాచ్‌  కోసం క్రీడాభిమానులు వేయి కళ్లతో  ఎదురుచూస్తున్నారు. దీనిని సద్వినియోగం చేసుకునేందుకు ఇండియన్‌ రైల్వేస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 

 

ప్రత్యేక వందేభారత్ రైళ్లు

అక్టోబరు 14న అహ్మదాబాద్‌లోని జరిగే దాయాది దేశాల మధ్య పోరుకు భారీగా అభిమానులు తరలిరానుండడంతో క్రికెట్‌ అభిమానులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. భారత్‌-పాక్‌ మ్యాచ్ జరిగే రోజున మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రల నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక వందే భారత్‌ రైళ్లు నడపనున్నట్లు వెల్లడించింది. ఈ రైళ్లు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. త్వరలోనే రైళ్ల షెడ్యూల్‌, టికెట్ ధరల వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. 

 

మ్యాచ్‌ ప్రారంభం కావడానికి కొన్నిగంటల ముందు ఈ ప్రత్యేక రైళ్లు సబర్మతీ, అహ్మదాబాద్ స్టేషన్లకు చేరుకుంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రెండు స్టేషన్లు నరేంద్ర మోదీ స్టేడియానికి దగ్గరగా ఉండటంతో అభిమానులు సులభంగా స్టేడియానికి చేరుకోవచ్చన్నారు. అదేవిధంగా మ్యాచ్‌ ముగిసిన కొద్ది గంటల తర్వాత ఈ రైళ్లు అహ్మదాబాద్‌ నుంచి తిరిగి బయల్దేరుతాయని, దాని వల్ల అభిమానులు అదే రోజు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకోవచ్చని తెలిపారు.

 

ఆకాశన్నంటిన హోటల్‌ ధరలు

భారత్‌-పాక్‌ మ్యాచ్‌ కోసం ఇప్పటికే అహ్మదాబాద్‌లో హోటల్‌ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హోటల్ ఛార్జీలు ఇప్పటికే 10 రెట్లు అయ్యాయి. భారత్‌ పాక్‌ మ్యాచ్‌ జరిగే అక్టోబర్ 14న ఒక్క రాత్రికి హోటల్ గదిలో బస చేసేందుకు ఒక్కరికి రూ. 30,000 నుంచి లక్ష రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. అహ్మదాబాద్‌లోని కొన్ని లగ్జరీ హెటళ్లు రూ. 50 వేల నుంచి రూ. 1 లక్ష వరకు వసూలు చేస్తున్నాయి. సాధారణ రోజుల్లో వీటి అద్దె రోజుకు రూ. 5,000 నుంచి రూ.8,000 మధ్య ఉంటుంది. అలాంటిది ఇప్పుడు రేట్లు లక్షను మించాయి. 

 

పెరిగిన విమాన టికెట్‌ ధరలు

మ్యాచ్‌ జరిగే రోజు వివిధ నగరాల నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లే విమాన టికెట్‌ ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి.  సాధారణంగా ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు ఒక్కొక్కరికి 2500 నుంచి 3 వేల వరకు ఉంటుంది. కానీ భారత్‌, పాక్‌ మ్యాచ్‌ దృష్ట్యా ఈ రేట్‌ ఏకంగా ఆరింతలు పెరిగింది. ఒక్కో టిక్కెట్‌కు 15 వేల నుంచి 20 వేల వరకు ధర పలుకుతోంది. తమ వెబ్‌సైట్‌లో టిక్కెట్ల కోసం అన్వేషించే వారి సంఖ్య అమాంతం పెరిగిందని ఈజీ మై ట్రిప్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. అక్టోబర్ 14న అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియం వేదికగా భారత్‌-పాక్‌ క్రికెట్ వార్ జరగబోతోంది.