Watch Video:
గొడవ పడిన పౌరుడు..
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ( Justin Trudeau)కి ఊహించని షాక్ ఇచ్చాడు ఓ సిటిజన్. సపోర్టర్స్‌తో మాట్లాడుతున్న సమయంలో ఉన్నట్టుండి ఓ వ్యక్తి ఆయనకి దగ్గరగా వచ్చాడు. ట్రూడో అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ముందుకి వచ్చాడు. కానీ...అందుకు ఒప్పుకోలేదా వ్యక్తి. పైగా ట్రూడోపైనే అరవడం మొదలు పెట్టాడు. అప్పటికే ఓ చిన్నారిని పలకరించి చాలా హ్యాపీగా నడుచుకుంటూ వస్తున్న ప్రధానిని ఇది షాక్‌కి గురి చేసింది. "నేను నీకు షేక్ హ్యాండ్ ఇవ్వను" అంటూ గట్టిగా అరిచాడా వ్యక్తి. ఎందుకింత స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవుతున్నారని ట్రూడో ప్రశ్నించారు. అందుకు ఆ వ్యక్తి "దేశం మొత్తాన్ని నువ్వు నాశనం చేశావ్. పరువు తీశావ్" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో తెగ వైరల్ అయిపోయింది. జస్టిన్ ట్రూడో ఆ వ్యక్తిని వరుస ప్రశ్నలు వేశారు. "నేను దేశాన్ని నాశనం చేశానా..? అలా ఎలా చెప్పలగలరు" అని ప్రశ్నించారు. అందుకు ఆ వ్యక్తి "మాకు కనీసం ఇల్లైనా ఇచ్చారా..? మమ్మల్ని పట్టించుకుంటున్నారా" అని అసహనం వ్యక్తం చేశాడు.
కార్బన్ ట్యాక్స్‌పైనా వాగ్వాదం..
దేశవ్యాప్తంగా ఇళ్ల కొరత సమస్య వేధిస్తోంది. దీనిపై నిరసనగానే ఆ వ్యక్తి ప్రధానిని నిలదీశాడు. "కార్బన్ ట్యాక్స్ వేస్తున్న మీ దగ్గరే కార్బన్‌ని ఎక్కువగా విడుదల చేసే బైక్‌లు ఉండడం ఏంటి..? మీరు చెప్పే మాటలకు చేసే దానికి ఏమైనా పొంతన ఉందా" అని ప్రశ్నించాడు. అందుకు ట్రూడో "ఆ ట్యాక్స్‌తో ఏం చేస్తున్నానో మీ అందరికీ తెలుసు కదా" అని సమాధానమిచ్చారు. పొల్యూషన్‌పై వేస్తున్న ట్యాక్స్‌ని మళ్లీ ప్రజల సంక్షేమం కోసమే ఖర్చు పెడుతున్నట్టు వివరించారు. ఆ తరవాత కూడా వాదన కొనసాగింది. ఈ ట్యాక్స్‌నంతా ఉక్రెయిన్‌కి తరలిస్తున్నారంటూ మండి పడ్డాడా వ్యక్తి. దీనికి ట్రూడో "మీరు బహుశా పుతిన్ మాటలు వింటున్నట్టున్నారు" అని నవ్వి ఊరుకున్నారు. మొత్తానికి ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.