వన్డే ప్రపంచకప్‌ను ఈసారి ఏ జట్టు దక్కించుకుంటుందా అన్న ఉత్కంఠ క్రికెట్‌ అభిమాలను తెగ టెన్షన్‌ పెడుతోంది. సెమీస్‌కు ఏయే జట్లు చేరుతాయి. ఫైనల్లో తలపడే జట్లేవి, ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రపంచకప్‌ను సగర్వంగా పైకి లేపే జట్టేది అన్న ఆసక్తి సగటు క్రికెట్‌ అభిమానికి ఉత్పన్నమవుతుంది. ఇంగ్లాండ్‌ బలమేంటి,  ఆస్ట్రేలియా మళ్లీ సత్తా చాటుతుందా,  తొలిమ్యాచ్‌లోనే సత్తా చాటిన కివీస్‌ ప్రపంచకప్‌ను ఎగరేసుకుని పోతుందా,  ముచ్చటగా మూడోసారి భారత్‌ వరల్డ్‌కప్‌ను చేజిక్కించుకుంటుందా అని క్రికెట్‌ అభిమానులు లెక్కలు వేస్తున్నారు. అయితే సెమీస్‌కు చేరే జట్లేవో క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ చెప్పేశాడు. అయితే ఈ దిగ్గజ ఆటగాడి టాప్‌ ఫోర్‌ జట్లలో దాయాది దేశం పాకిస్థాన్‌ లేకపోవడం క్రికెట్‌ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. 


ఆల్  టైం గ్రేట్‌ బ్యాటర్లలో ఒకడైన సచిన్‌ భారత్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్‌ చేరే జట్లేవో చెప్పేశాడు. ఈ మహా సంగ్రామంలో భారత్‌, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా నాకౌట్‌ మ్యాచ్‌లకు అర్హత సాధిస్తాయని సచిన్‌ అంచనా వేశాడు. అయితే ఇందులో పాకిస్థాన్‌ జట్టు లేకపోవడం క్రికెట్‌ ప్రేమికులను ఆశ్చర్యానికి గురిచేసింది.


ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ టూ స్థానంలో ఉన్న పాక్‌ సెమీఫైనల్‌కు కూడా చేరలేదన్న సచిన్‌ అంచనా ఆశ్చర్యపరుస్తోంది. భారత్‌ జట్టు సమతూకంగా ఉందన్న సచిన్‌.. మంచి ఫీల్డింగ్, వికెట్ల మధ్య బాగా పరుగెత్తే ఆటగాళ్లు ఆ జట్టు అదనపు బలమని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా కూడా ఇలాగే ఉందని.. ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీలో వారిని తక్కువ అంచనా వేయలేమని ఈ దిగ్గజ క్రికెటర్‌ అభిప్రాయపడ్డాడు. అనుభవం, యువ ఆటగాళ్లతో కంగారు జట్టు ప్రత్యర్థి జట్లకు కంగారు పుట్టించగలదని సచిన్‌ అభిప్రాయపడ్డాడు. తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైనా ఇంగ్లాండ్ చాలా బలమైన జట్టు అన్న సచిన్‌.. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు, యువ ఆటగాళ్లతో ఆ జట్టు కూడా సమతూకంగా ఉందన్నాడు. న్యూజిలాండ్ 2015, 2019లో ఫైనల్స్‌ ఆడిందని..ఈసారి ఆ జట్టు ప్రపంచకప్‌ను అంత తేలిగ్గా వదలదని సచిన్‌ చెప్పాడు. కివీస్‌ ట్రాక్ రికార్డ్‌ను పరిశీలిస్తే, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో న్యూజిలాండ్ ఎప్పుడూ బాగానే రాణిస్తుందని గుర్తు చేశారు. కాబట్టి కివీస్‌ సెమీస్‌ చేరడం తథ్యమని  సచిన్‌ అంచనా వేశాడు.


 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ గురువారం ప్రారంభమైంది. హోరాహోరీ తప్పదనుకున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను న్యూజిలాండ్‌ చిత్తు చేసి తొలి అడుగు బలంగా వేసింది. బౌండరీలు తక్కువ కొట్టడం వల్ల 2019 ప్రపంచకప్‌ను కోల్పోయిన కివీస్‌.. ఈసారి ఆ జట్టును చిత్తుగా ఓడించి టోర్నీని ఘనంగా ఆరంభించింది. ఇంగ్లాండ్‌ విధించిన 282 పరుగుల లక్ష్యాన్ని కేవలం 36.2 ఓవర్లలో ఒక్క వికెట్టే కోల్పోయి ఛేదించింది.  డెవాన్ కాన్వే 152 పరుగులు, భారత సంతతికి చెందిన రచిన్ రవీంద్ర 123 పరుగులతో అజేయంగా నిలిచి కివీస్‌కు ఘన విజయం అందించారు. కాన్వే, రచిన్‌ల రెండో వికెట్‌ భాగస్వామ్యం ప్రపంచకప్‌లో కివీస్‌ తరఫున ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడైన 23 ఏళ్ల రచిన్‌ రికార్డు నెలకొల్పాడు.