అది భారత్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయం. ఆస్ట్రేలియా విధించిన 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో ఉన్న సమయం. అంతటి క్లిష్ట పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రతీ బంతి వారి సహనాన్ని పరీక్షిస్తోంది. చిన్నగా భారత్ స్కోరు రెండు పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన స్థితి నుంచి ఎనిమిది ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 20 పరుగులు చేసిన స్థితికి చేరింది. భారత్ ఓటమి బారి నుంచి ఇంకా బయట పడలేదు. ఇంకో వికెట్ పడితే చాలు... ఇండియా మిగిలిన బ్యాటర్ల పని పట్టడం ఆస్ట్రేలియాకు పెద్ద పనికాదు. ఆ సమయంలో అందివచ్చిన అవకాశాన్ని మిచెల్ మార్ష్ జారవిడవడంతో జీవనదానం పొందిన కోహ్లీ.... 85 పరుగులతో భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
హేజిల్‌వుడ్ ఎనిమిదో ఓవర్ వేసేందుకు బంతి తీసుకున్నాడు. అప్పటికే చాలాసేపు ఓపికగా చూసిన కోహ్లీకి సహనం నశించింది. ఆస్ట్రేలియా బౌలర్ల లయను దెబ్బ తీయాలన్న ఉద్దేశంతో హేజిల్‌వుడ్ వేసిన బంతిని ఫుల్ చేశాడు. బంతి గాల్లో లేచింది. అంతే కోట్లాది మంది అభిమానుల గుండెలు ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. మిచెల్ మార్ష్ బంతిని అందుకునేందుకు ముందుకు పరిగెత్తాడు. బంతిని దాదాపుగా అందుకునేంత పనిచేసిన మార్ష్... తడబాటుతో క్యాచ్‌ను జారవిడిచాడు. అంతే ఈ జీవనదానంతో మరింత జాగ్రత్తగా ఆడిన కోహ్లీ టీమిండియాకు మరచిపోలేని విజయాన్ని అందించాడు. మార్ష్ క్యాచ్ జారవిడిచినప్పుడు కోహ్లీ స్కోరు కేవలం పన్నెండు పరుగులు మాత్రమే. తర్వాత మరో 73 పరుగులు చేసిన విరాట్... కంగారు బౌలర్లకు మరో అవకాశం ఇవ్వకుండా టీమిండియాకు విజయాన్ని అందించాడు. అయితే ఈ క్యాచ్ గాల్లోకి లేచినప్పుడు తన పరిస్థితి గురించి టీమిండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్ వివరించాడు.
" విరాట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడ బంతి గాల్లోకి లేవగానే నాకేమీ అర్థం కాలేదు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వెళ్లిపోయాను. కోహ్లీ క్యాచ్‌ను మార్ష్ తప్పక అందుకుంటాడని భావించాను. అందుకే డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వెళ్లిపోయాను. కోహ్లీ బంతిని గాల్లోకి లేపడం చూసి నాకేం చేయాలో కూడా అర్థం కాలేదు. మ్యాచ్ అంతా నన్ను పిలవాలని సహచరులకు చెప్పాను. మ్యాచ్ ముగిసేంత వరకు తాను ఎక్కడైతే నిలబడ్డానో అలాగే ఉన్నాను. కదిలితే మరో వికెట్ పడుతుందని నా నమ్మకం. అందుకే మ్యాచ్ ముగిసే వరకు అక్కడి నుంచి కదల్లేదు. ఇప్పుడు నా పాదాలు బాగా నొప్పిగా ఉన్నాయి" అని అశ్విన్ వివరించాడు.
అస్ట్రేలియాతో మ్యాచ్ ఎప్పూడూ చాలా కఠినంగానే ఉంటుందన్న అశ్విన్.. ప్రపంచకప్‌లాంటి మెగా ఈవెంట్‌లలో వారిని తొలి మ్యాచ్‌లోనే ఓడించడం ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుందని అన్నాడు. ఆస్ట్రేలియాను 199 పరుగులకే కుప్పకూల్చడం అంత తేలికైన విషయం కాదని అశ్విన్ అన్నాడు. ఇక నిన్న జరిగిన మ్యాచ్‌లో గెలిచి టీమిండియా వరల్డ్ కప్‌లో బోణీ కొట్టింది. మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఆరు వికెట్లతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ 41.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి గెలిచింది. ప్రస్తుతానికి భారత్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. కానీ మంచి నెట్ రన్‌రేట్‌ను సాధించింది. 1999 తర్వాత ఆస్ట్రేలియా ప్రపంచకప్ మొదటి మ్యాచ్‌లో ఓడిపోవడం ఇదే మొదటి సారి.