టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్ భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 176 పరుగులు చేసింది. పాకిస్తాన్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్ (67: 52 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా ఫైనల్స్‌లోకి అడుగు పెట్టాలంటే 177 పరుగులు చేయాల్సి ఉంది. ఒకవేళ ఆస్ట్రేలియా గెలిచి ఫైనల్స్‌కు చేరితే కొత్త చరిత్ర అవుతుంది. ఎందుకంటే ఈసారి మనం కొత్త చాంపియన్‌ను చూడవచ్చు.


ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే అతని నిర్ణయం తప్పని తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. పాకిస్తాన్ ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్(67: 52 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), బాబర్ ఆజమ్(39: 34 బంతుల్లో, ఐదు ఫోర్లు) ఆస్ట్రేలియా బౌలర్లకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. దీంతో పవర్‌ప్లే ఆరు ఓవర్లలో పాకిస్తాన్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 47 పరుగులు చేసింది.


మొదటి వికెట్‌కు 71 పరుగులు జోడించిన అనంతరం బాబర్ ఆజమ్ అవుటయ్యాడు. దీంతో పది ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. ఆ తర్వాత మహ్మద్ రిజ్వాన్, ఫకార్ జమాన్ (55 నాటౌట్: 32 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) కలిసి పాకిస్తాన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు.


వీరిద్దరూ రెండో వికెట్‌కు కేవలం 7.2 ఓవర్లలోనే 72 పరుగులు జోడించారు. అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాక మహ్మద్ రిజ్వాన్, ఫకార్ జమాన్‌తో కలిసి జోష్ హజిల్ వుడ్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఏకంగా 21 పరుగులు రాబట్టారు. ఆ తర్వాతి ఓవర్లోనే స్టార్క్.. రిజ్వాన్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత ఫకార్ జమాన్ తన అద్భుతమైన బ్యాటింగ్‌ను కొనసాగించాడు. రిజ్వాన్ అవుటైన ఓవర్లోనే జమాన్ ఏకంగా 15 పరుగులు రాబట్టాడు.


19వ ఓవర్లో ప్యాట్ కుమిన్స్ బౌలింగ్‌లో ఆసిఫ్ అలీ డకౌటయ్యాడు. ఆ ఓవర్లో కేవలం మూడు పరుగులు మాత్రమే వచ్చాయి. స్టార్క్ వేసిన చివరి ఓవర్లో ఫాంలో ఉన్న షోయబ్ మాలిక్‌ను(1: 2 బంతుల్లో) అవుట్ చేశాడు. కానీ ఫకార్ జమాన్ రెండు సిక్సర్లు కొట్టడంతో ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లోనే ఫకార్ జమాన్ అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో పాకిస్తాన్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. మొదటి 10 ఓవర్లలో 71 పరుగులు మాత్రమే చేసిన పాకిస్తాన్.. చివరి 10 ఓవర్లలో 105 పరుగులు సాధించింది. చివరి నాలుగు ఓవర్లలోనే 55 పరుగులు రావడం విశేషం.