ఐసీసీ టీ20 ప్రపంచకప్ సూపర్12లో టీమ్‌ఇండియా మరో పోరుకు సిద్ధమైంది. ప్రమాదకర అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. ఇప్పటికే రెండు వరుస ఓటములతో దిగాలు పడిన కోహ్లీసేనకు ఈ పోరులో విజయం అత్యంత కీలకం. బుడగ ఒత్తిడితో చిత్తవుతున్నామని ఆటగాళ్లు అంటున్నా ఈ మ్యాచులోనూ టాసే అత్యంత కీలకం! మరి టీమ్‌ఇండియా ఏం చేస్తుందో చూడాలి!!
ఆధిపత్యం మనదే అయినా!
అఫ్గానిస్థాన్, భారత్ ఇప్పటి వరకు రెండుసార్లే టీ20ల్లో తలపడ్డాయి. రెండుసార్లూ టీమ్‌ఇండియాదే విజయం. ఇక ఈ ప్రపంచకప్‌లో కోహ్లీసేన ఫామ్ ఏమంత బాగాలేదు. దుబాయ్‌లో తలపడ్డ రెండు మ్యాచుల్లోనూ ఓటమి చవిచూసింది. టాస్ గెలిచిన మొదట ఫీల్డింగ్ చేసిన పాక్, న్యూజిలాండ్ విజయాలు అందుకున్నాయి. అఫ్గాన్ మాత్రం మూడు మ్యాచులాడి రెండు గెలిచి టాప్2లో ఉంది.
టాసే హీరో
ఈ మ్యాచ్ వేదిక అబుదాబి. ఇక్కడా టాసే కీలకం. ఛేదన చేస్తున్న జట్లే విజయాలు అందుకుంటున్నాయి. ఇక్కడ పది మ్యాచులు జరిగితే ఏడింట్లో ఛేజ్ చేసిన జట్లే గెలవడం గమనార్హం. మిగతా మూడు జట్లు తొలుత బ్యాటింగ్ చేసినా గెలవడానికి కారణం అవి నమీబియా, ఐర్లాండ్‌పై ఆడటమే! అబుదాబి పిచ్ సైతం దుబాయ్ తరహాలోనే ప్రవర్తిస్తోంది. బంతి స్వింగ్ అవుతోంది. స్పిన్నర్లూ ప్రభావం చూపిస్తున్నారు. మొదట బ్యాటింగ్‌కు అస్సలు అనుకూలించడం లేదు. మంగళవారం పాక్‌ను తొలి పది ఓవర్ల వరకు నమీబియా బంతితో వణికించింది! అందుకే ఇక్కడ కోహ్లీ టాస్ గెలవడం ముఖ్యం.
ఒత్తిడిలో టీమ్‌ఇండియా
టీమ్‌ఇండియా బుడగ ఒత్తిడి.. ఓటమి భారంతో కనిపిస్తోంది. ఆటగాళ్లలో ఉత్తేజం, పట్టుదల కనిపించడం లేదు. ఓటమి దిగులు వారిని వేధిస్తోంది. బహుశా ఈ మ్యాచులో రోహిత్‌ను ఓపెనింగ్‌కు పంపిస్తారు. ఇషాన్ రావడంతో మరి రాహుల్‌ను నాలుగో స్థానంలో ఆడిస్తారా అన్న సందేహాలూ ఉన్నాయి. సూర్యకుమార్ ఇంకా కోలుకోలేదు. బౌలింగ్, ఫీల్డింగ్‌లో ప్రభావం చూపించని హార్దిక్ పాండ్య భారంగా మారుతున్నాడు. కోహ్లీ, రిషభ్ రాణించాలి. వరుణ్ చక్రవర్తి ఇప్పటి వరకు తన మ్యాజిక్ చూపించలేదు. బహుశా అతడి స్థానంలో రాహుల్ చాహర్‌ను తీసుకోవచ్చు. జడ్డూ సైతం బంతితో రాణించడం లేదు. ఇప్పటికే యాష్‌ను ఎందుకు ఆడించలేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బుమ్రా ఒక్కడే సత్తా చాటుతున్నాడు. షమి, భువీ, శార్దూల్ రాణించాల్సిన అవసరం ఉంది.
అఫ్గాన్ ప్రమాదకారి
అఫ్గాన్‌కు యూఏఈలో తిరుగులేని రికార్డు ఉంది. మొన్న పాక్ చేతిలో తప్ప ఎన్నడూ అక్కడ ఓటమి చవిచూడలేదు. లెగ్ స్పిన్నర్ రషీద్ అత్యంత కీలకం అవుతాడు. రాహుల్‌పై అతడికి మెరుగైన రికార్డు ఉంది. అయితే రషీద్ బౌలింగ్‌ను ఇషాన్ చితకబాదగలడు. మహ్మద్ నబీ కెప్టెన్‌గా తెలివైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. బౌలర్లను చక్కగా ఉపయోగిస్తున్నాడు. జజాయ్, షెహజాద్ బ్యాటింగ్ చేయడం వారికి అత్యవసరం. అఫ్గాన్‌లో ఎక్కువ మంది ఆల్‌రౌండర్లే ఉండటంతో ఏడో స్థానం వరకు బ్యాటింగ్ చేయగలరు. ఒకవేళ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంటే మాత్రం టీమ్‌ఇండియాకు అగ్ని పరీక్ష పెట్టగలరు! ముజీబుర్ రెహ్మాన్ రూపంలో మిస్టరీ స్పిన్నర్ ఉన్నాడు. ఏదేమైనా అఫ్గాన్‌ను తక్కువగా తీసుకుంటే కోహ్లీసేనకు ఇబ్బంది తప్పదు!
Also Read: Khel Ratna Award 2021: ఈసారి 12 మందికి ఖేల్‌రత్న.. ఒలింపియన్లకు గౌరవం.. జాబితాలో మిథాలీ, ఛెత్రీ