ICC Men's T20I Batting Rankings : టీమ్‌ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumrar Yadav) రికార్డులు సృష్టిస్తున్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకాడు. అగ్రస్థానంలోని పాక్ కెప్టెన్ బాబార్ ఆజామ్ (Babar Azam) స్థానానికి ఎసరు పెట్టేందుకు రెడీగా ఉన్నాడు. ఎందుకంటే వీరిద్దరి మధ్య అంతరం కేవలం రెండు పాయింట్లే కావడం గమనార్హం. ఇంగ్లాండ్ సిరీసు నుంచి సూర్య మంచి ఫామ్‌లో ఉన్నాడు. నాటింగ్‌హామ్‌లో సెంచరీ కొట్టాడు. ఇప్పుడు కరీబియన్ జట్టుపై మూడు మ్యాచుల్లో 168 స్ట్రైక్‌రేట్‌తో 111 పరుగులు చేశాడు.
గతేడాది ఆరంభంలో సూర్యకుమార్ టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం చేశాడు. అప్పటికే దేశవాళీ, ఐపీఎల్ క్రికెట్లో తిరుగులేని ఆటతీరుతో ప్రశంసలు పొందాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లోనూ దూకుడుగా ఆడుతున్నాడు. అత్యంత వేగంగా ఐసీసీ టాప్-10 ర్యాంకుల జాబితాలో చేరిపోయాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో అతడు విజృంభించిన సంగతి తెలిసిందే. ప్రత్యర్థి నిర్దేశించిన 165 పరుగుల లక్ష్య ఛేదనలో సూర్య కేవలం 44 బంతుల్లో 76 రన్స్ కొట్టాడు. 8 బౌండరీలు, 4 సిక్సర్లు దంచేశాడు. దాంతో అతడి ర్యాంకు మరింత మెరుగైంది.
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ 818 రేటింగ్ పాయింట్లతో నంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు. సూర్య 2 స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. 816 రేటింగ్ పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. అతడు మినహా టీమ్‌ఇండియా నుంచి ఎవరూ టాప్-10లో లేకపోవడం గమనార్హం. ఓపెనర్ ఇషాన్ కిషన్ 14, కెప్టెన్ రోహిత్ శర్మ 16, కేఎల్ రాహుల్ 20వ ర్యాంకులో ఉన్నారు. బౌలింగ్‌లో భువీ 653 రేటింగ్‌తో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు.
IND vs WI 3rd T20 Highlights: వెస్టిండీస్‌తో మూడో టీ20లో టీమ్‌ఇండియా విజయం సాధించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని మరో 6 బంతులు మిగిలుండగానే ఛేదించింది. 7 వికెట్ల తేడాతో సిరీసులో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఛేదనలో సూర్యకుమార్ యాదవ్ (76; 44 బంతుల్లో 8x4,4x6) హాఫ్ సెంచరీతో మెరిశాడు. రిషభ్ పంత్ (33*; 26 3x4, 1x6) అజేయంగా నిలిచాడు. అంతకు ముందు విండీస్‌లో కైల్ మేయర్స్ (73; 50 బంతుల్లో 8x4,4x6) విజృంభించాడు. రోమన్ పావెల్ (23), నికోలస్ పూరన్ (22) ఫర్వాలేదనిపించారు.