Hockey World Cup 2023:  హాకీ ప్రపంచకప్ 2023 మ్యాచ్ లు ఉత్కంఠగా సాగుతున్నాయి. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో భారత్ రెండు మ్యాచ్ లు ఆడింది. అందులో ఒకదానిలో విజయం సాధించగా.. ఇంకొకటి డ్రాగా ముగిసింది. టీమిండియా తదుపరి మ్యాచ్ జనవరి 19న వేల్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ కు ముందు భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది. 


హాకీ ప్రపంచకప్ లో డీ గ్రూపులో ఉన్న భారత్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆడిన రెండు మ్యాచుల్లో ఒక విజయం, ఒక డ్రాతో కొనసాగుతోంది. స్పెయిన్ పై గెలవగా.. ఇంగ్లండ్ తో మ్యాచ్ డ్రా అయ్యింది. జనవరి 19న భారత్- వేల్స్ మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ కు టీమిండియా మిడ్ ఫీల్డర్ హార్దిక్ రాయ్ దూరమయ్యే అవకాశం ఉంది. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో ఈ అటాకింగ్ ప్లేయర్ గాయపడ్డాడు. దీంతో అతను తదుపరి మ్యాచుకు అందుబాటులో ఉండడని సమాచారం. 


తుది నిర్ణయం అప్పుడే


టీమిండియా హాకీ టీమ్ లో అటాకింగ్ మిడ్ ఫీల్డర్ హార్దిక్ రాయ్ కీలక ఆటగాడు. తన అటాకింగ్ గేమ్ తో జట్టుకు చాలాసార్లు ఉపయోగపడేలా ఆడాడు. ఈ మెగా టోర్నీలో స్పెయిన్ పై విజయంలో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. అలాగే ఇంగ్లండ్ మ్యాచ్ డ్రా గా ముగియడంలోనూ హార్దిక్ ది ప్రధాన పాత్ర. ఇప్పుడు వేల్స్ తో మ్యాచ్ లో అతను దూరమవడం భారత్ కు ఎదురుదెబ్బే.  హార్దిక్ కండరాలు పట్టేశాయి. అతనిని వైద్యులు పరీక్షించారు. జట్టు మేనేజ్ మెంట్ వారి నుంచి అతని వైద్య నివేదికలు తెప్పించి పరీక్షించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇంగ్లండ్ తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన తర్వాత అతను నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. అయితే ఆ గాయం మరీ తీవ్రమైనది కాదని అనిపిస్తోంది. అని టీమిండియా ప్రధాన కోచ్ గ్రాహం రీడ్ తెలిపారు. 


గ్రూప్- డీలో ఉన్న భారత్ ఒక విజయం, ఒక డ్రాతో 4 పాయింట్లు సాధించి రెండో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ కూడా 4 పాయింట్లతోనే ఉన్నప్పటికీ గోల్స్ తేడాతో అగ్రస్థానంలో నిలిచింది.