Tayyab Ikram On PAK:  పాకిస్థాన్ హాకీ తిరిగి తన పూర్వవైభవం సాధించాలంటే భారత్ అవలంభిస్తున్న విధానాలను అనుసరించాలని.. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ తయ్యబ్ ఇక్రమ్ అన్నారు. ఒడిశాలో జరుగుతున్న పురుషుల హాకీ ప్రపంచకప్ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. 


జులై 2022లో ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గా నరీందర్ బాత్రా స్థానంలో తయ్యబ్ ఇక్రమ్ నియమితులయ్యారు. ఎఫ్ ఐహెచ్ ప్రెసిడెంట్ గా ఆయన 2 నెలల పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్నారు.  ఒడిశాలో జరిగిన పురుషుల హాకీ ప్రపంచకప్ ఆరంభ వేడుకల్లో పాల్గొన్నారు. 60 రోజుల పదవీకాలం పూర్తయిన సందర్భంగా జరిగిన మీడియా మీట్ లో ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 


భారత్ విధానాలు చాలు


ఈ సందర్భంగా పాకిస్థాన్ హాకీనీ ఎఫ్ ఐహెచ్ పునరుద్ధరించగలదా అన్ని ప్రశ్న విలేకర్ల నుంచి తయ్యబ్ ఇక్రమ్ కు ఎదురైంది. దానికి ఆయన ఇలా సమాధానమిచ్చారు. 'హాకీ క్రీడలో పాకిస్థాన్ ఒక ముఖ్య వాటాదారు. ఇటీవలి టోర్నమెంట్లను చూస్తే ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆస్తి భారత్- పాకిస్థాన్ మ్యాచ్' అని తయ్యబ్ అన్నారు. 'పాకిస్థాన్ హాకీని పునరుద్ధరించేందుకు మేం చాలా దూరం వెళ్లాల్సిన అవసరంలేదు. విభిన్న మోడల్స్ ను అనుసరించనక్కర్లేదు. హాకీ ఇండియా అవలంభించిన విధానాలను అనుసరిస్తే చాలు. స్థిరమైన విధానం, వృత్తిపరమైన విధానం, అథ్లెట్ల కోసం కావాల్సిన ఇన్ పుట్, ఇంకా మైండ్ సెట్ ను మార్చుకోవడం. ఇలాంటి విధానాలను అనుసరిస్తే పాక్ మళ్లీ పూర్వవైభవాన్ని అందుకుంటుంది.' అని తయ్యబ్ ఇక్రమ్ అన్నారు. 


పాకిస్థాన్ ఇప్పటివరకు అత్యధికంగా 4 సార్లు హాకీ ప్రపంచకప్ ను గెలుచుకుంది. అయితే 2023 ఎడిషన్ కు కనీస్ అర్హత సాధించలేకపోయింది. 2014 తర్వాత రెండోసారి ఈ టోర్నమెంట్ కు అర్హత సాధించడంలో పాకిస్థాన్ హాకీ టీమ్ విఫలమైంది.