పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రాతో హర్షల్‌ పటేల్‌ కలిశాడంటే టీమ్‌ఇండియా డెత్‌ బౌలింగ్‌ శత్రు దుర్భేద్యంగా మారిపోతుందని న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు డేనియెల్‌ వెటోరీ అంటున్నాడు. టీ20 క్రికెట్లో బుమ్రా ఇప్పటికే ఓ హీరో అన్నాడు. వేగంలో మార్పు చేస్తూ బ్యాటర్లను బోల్తా కొట్టించే పటేల్‌ అతడితో కలిశాడంటే భారత్‌ మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందన్నాడు.


'టీ20ల్లో ఆఖరి ఓవర్లలో పరుగులు నియంత్రించి వికెట్లు తీయడం అత్యంత ముఖ్యం. హర్షల్‌ పటేల్‌కు ఆ సామర్థ్యం ఉందనే అనిపిస్తోంది. బుమ్రా ఏం చేయగలడో మనకు తెలుసు. వీరిద్దరూ కలిస్తే జట్టు ప్రమాణాలు పూర్తిగా మారిపోతాయి. ప్రత్యర్థికి కష్టమవుతుంది' అని వెటోరీ అన్నాడు.


'పొట్టి క్రికెట్లో తొలి ఆరు ఓవర్లు దూకుడుగా ఆడతారు. పవర్‌ప్లేలో వేసే ప్రత్యేక బౌలర్లు ఉండొచ్చు. కానీ ఆఖరి ఓవర్లలో వికెట్లు తీసే బౌలర్లు అవసరం. ఇలా చాలామంది చేయలేరు. ఆ సామర్థ్యం ఉన్న బుమ్రా, హర్షల్‌ కలిస్తే టీమ్‌ఇండియా మరింత అభేద్యమైన జట్టుగా అవతరిస్తుంది' అని వెటోరీ అంచనా వేశాడు.


యువ పేసర్‌ హర్షల్‌ పటేల్‌ న్యూజిలాండ్‌తో రెండో టీ20లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. కివీస్‌ 180+ స్కోరువైపు పరుగులు తీస్తున్న సమయంలో బంతి అందుకున్నాడు. కేవలం 25 పరుగులిచ్చి 2 కీలకమైన వికెట్లు తీశాడు. ప్రత్యర్థి జట్టులో ఎక్కువ పరుగులు చేసి జోరుమీదున్న డరైల్‌ మిచెల్‌ (31), గ్లెన్‌ ఫిలిప్స్‌ (34)ను పెవిలియన్‌ పంపించి ఆ జట్టు లయను దెబ్బతీశాడు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అందుకున్నాడు.


ఐపీఎల్‌లో పటేల్‌ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మధ్య ఓవర్లు, డెత్‌ ఓవర్లలో బంతి వేగంలో మార్పులు చేసి బ్యాటర్లను బోల్తా కొట్టిస్తాడు. బ్యాక్‌ ఆఫ్‌ ది హ్యాండ్ డెలివరీలతో వికెట్లు తీస్తుంటాడు. బెంగళూరు తరఫున ఈ సీజన్లో ఏకంగా 32 వికెట్లు తీశాడు. ఒక సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన డ్వేన్‌ బ్రావోను సమం చేశాడు. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.






Also Read: Tim Paine Quits: మహిళకు ఆసీస్‌ క్రికెటర్‌ అశ్లీల సందేశం.. వివాదం ముదిరి కెప్టెన్సీకి రిజైన్‌


Also Read: AB de Villiers Retirement: ఇకపై కోహ్లీ, ఏబీడీ కలిసి ఆడరు.. షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన ఏబీడీ?


Also Read: ABD Retirement: గుండె బద్దలైంది..! లవ్‌యూ సోదరా అంటూ ఏబీడీ, కోహ్లీ బ్రొమాన్స్‌!


Also Read: MS Dhoni fan: ధోనీని చూసేందుకు 1436 కి.మీ పాదయాత్ర చేసిన డైహార్డ్‌ ఫ్యాన్‌!


Also Read: Ind vs NZ, 2nd T20, Highlights: RRRకు తొలి విజయం.. న్యూజిలాండ్‌పై సిరీస్ గెలిచేసిన టీమిండియా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి