కరోనా వైరస్ పంజా విసురుతోంది. దేశ వ్యాప్తంగా మూడో వేవ్ విజృంభిస్తోంది. తొలి రెండు దఫాల్లో ప్రజలను ఇబ్బంది పెట్టిన వైరస్ మూడో వేవ్‌లో ప్రముఖులను వెంటాడుతోంది!
తాజాగా టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌కు పాజిటివ్ వచ్చింది. స్వల్ప లక్షణాలతో అతడు బాధపడుతున్నాడు. ఇంట్లోనే క్వారంటైన్ అయ్యాడు. జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఈ మధ్య కాలంలో తనతో సన్నిహితంగా మెలగిన వారు జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. త్వరగా టెస్టులు చేయించుకోవాలని సలహా ఇచ్చాడు.
'స్వల్ప లక్షణాలతో నాకు కొవిడ్ వచ్చింది. ఇంట్లోనే నేను క్వారంటైన్ అయ్యాను. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో నన్ను కలిసిన అందరూ వీలైనంత త్వరగా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నా. జాగ్రత్తగా, సురక్షితంగా ఉండండి' అని భజ్జీ ట్వీట్ చేశాడు. ఈ మధ్య కాలంలోనే అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
Also Read: IND vs SA 2nd ODI: టీమ్‌ఇండియాలో మార్పులకు రాహుల్ సై..! లేదంటే ఓటమి బాటే!!
Also Read: IND vs WI Reschedule: విండీస్ షెడ్యూల్లో మార్పు! అహ్మదాబాద్, కోల్‌కతాల్లోనే మ్యాచులు!
Also Read: Virat Kohli Record: సాహో.. కోహ్లీ! ఇక ఈ రికార్డును బద్దలు కొట్టడం ఇప్పట్లో సాధ్యం కానట్టే!
హర్భజన్ సుదీర్ఘ కాలం టీమ్‌ఇండియాకు సేవలు అందించాడు. 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20లు ఆడాడు. వరుసగా 417, 269, 25 వికెట్లు తీశాడు. టెస్టు కెరీర్లో ఏకంగా 25 సార్లు ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. ఐదు సార్లు పది వికెట్ల పడగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ అతడికి మంచి పేరుంది. సుదీర్ఘ ఫార్మాట్లో 2 సెంచరీలు చేశాడు. 2224 పరుగులు సాధించాడు. ఇక వన్డేల్లో 1237, టీ20ల్లో 108 పరుగులు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగులో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడాడు. కొన్ని రోజుల క్రితమే భజ్జీ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్‌లో అతడికి మెంటార్‌గా అవకాశాలు వస్తున్నాయి.