Glenn Maxwell, IPL 2023: ఐపీఎల్ 2023 చాలా దగ్గరగా వచ్చింది. టోర్నీ ప్రారంభం కావడానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సీజన్‌లో మరోసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పూర్తి సన్నద్ధతతో కనిపిస్తున్నప్పటికీ టోర్నీ ప్రారంభం కాకముందే ఆ జట్టుకు బ్యాడ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ గ్లెన్ మాక్స్‌వెల్ పూర్తిగా ఫిట్‌గా లేడు. మ్యాక్స్‌వెల్ స్వయంగా తన ఫిట్‌నెస్ గురించి అప్‌డేట్ ఇచ్చాడు. అతను పూర్తిగా ఫిట్‌గా ఉండేందుకు నెలరోజులు పడుతుందని చెప్పాడు.


2022 నవంబర్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ కాలుకు ఫ్రాక్చర్ అయింది. తన బర్త్ డే పార్టీలో మ్యాక్స్‌వెల్ హర్ట్ అయ్యాడు. ఆ తర్వాత దాదాపు ఆరు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అతను ఐపీఎల్ 2023 కోసం బెంగళూరు చేరుకున్నాడు. కానీ దానికి ముందు అతను తన గాయం గురించి పెద్ద అప్‌డేట్ ఇచ్చాడు. ఇది బెంగళూరుకు ఆందోళన కలిగించే విషయం.


100 శాతం కోలుకోవడానికి కొన్ని నెలలు
ఆర్సీబీ యొక్క సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసిన వీడియో ద్వారా, మాక్స్‌వెల్ మాట్లాడుతూ, "కాలు బాగానే ఉంది. నేను 100 శాతం కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. చివరికి కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నాను. ఇది చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. నా హోమ్ అభిమానుల ముందు ఆడేందుకు నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను." అన్నాడు


ఇటీవల భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో అతను ఆడాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతను ఎనిమిది పరుగులు చేశాడు. అలాగే రెండు ఓవర్లు కూడా బౌల్ చేశాడు. అందులో అతను ఏడు పరుగులు ఇచ్చాడు.


ఐపీఎల్ 2022లో అద్భుత ప్రదర్శన
బెంగళూరు తరపున ఆడుతున్న మాక్స్‌వెల్ ఐపీఎల్ 2022లో 13 మ్యాచ్‌లలో 27.36 సగటు, 169.10 స్ట్రైక్ రేట్‌తో 301 పరుగులు చేశాడు. ఇందులో అతను హాఫ్ సెంచరీ సాధించాడు. అదే సమయంలో అతను బౌలింగ్‌లో మొత్తం 6 వికెట్లు తీసుకున్నాడు. అందులో అతని ఎకానమీ 6.88గా ఉంది.


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో మాక్స్‌వెల్‌ది విచిత్రమైన కెరీర్‌! పంజాబ్‌ తరఫున ఒక సీజన్లో అదరగొట్టాడు. ఆ తర్వాత ప్రతి సీజన్లోనూ నిరాశపరిచాడు. ప్రతిసారీ వేలం ముంగిట అతడిని విడిచేసేశారు. మళ్లీ భారీ ధరకు తీసుకొనేవారు. 2021లో అతడిని ఆర్‌సీబీ కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియాకు ఎలాంటి పాత్ర పోషిస్తాడే అలాంటి స్థానమే ఇచ్చింది. దాంతో అతడు రెచ్చిపోయి ఆడాడు. అర్ధశతకాలతో జట్టును చాలా మ్యాచుల్లో గెలిపించాడు. మ్యాచ్‌ ఫినిషర్‌గా ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈ సీజన్లోనూ అతడి నుంచి ఆర్‌సీబీ అలాంటి ప్రదర్శనే ఆశిస్తోంది.


ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌ను చాలా ప్రశంసించాడు. ”మ్యాచ్ ప్రారంభమైందని నాకు తెలియదు. కానీ నేను తర్వాత స్కోర్‌కార్డ్‌ని చూసి, దాన్ని ఫొటో తీసి ఆరోన్ ఫించ్‌కు పంపించాను. అసలక్కడ ఏం జరుగుతోంది? అతను పూర్తిగా భిన్నమైన గ్రహంపై బ్యాటింగ్ చేస్తున్నాడు. అందరి స్కోర్‌లను, తన స్కోర్‌ను చూడండి" అని మాక్స్‌వెల్ అన్నాడు.