Cricket World Cup News: భారత్‌లో క్రికెట్‌ సందడి మొదలైంది. స్వదేశంలో జరుగుతున్న ఈ మెగా టోర్నీని భారత్‌ కైవసం చేసుకుంటుందని క్రికెట్‌ ప్రేమికులు గంపెడాశలు పెట్టుకున్నారు. 2011లాగే ఈసారి రోహిత్‌ ప్రపంచకప్‌ను ఎత్తి... తమను ఆనంద డోలికల్లో తేలియాడిస్తాడని క్రికెట్‌ ప్రేమికులు భావిస్తున్నారు. 2011లో చివరి బంతికి ధోని సిక్స్‌ కొట్టి వన్డే వరల్డ్‌ కప్‌ను ఒడిసి పట్టిన క్షణాలు ఏ క్రికెట్‌ అభిమాని అంత తేలిగ్గా మరచిపోలేడు. 2011లో ప్రతీ మ్యాచ్‌లో 

టీమిండియా ముందుకు సాగిన తీరు... కోచ్‌గా గ్యారి కిర్‌స్టెన్‌ దిశా నిర్దేశం జట్టును విజయ తీరాలకు చేర్చి రెండోసారి ప్రపంచకప్‌ను అందించింది. అయితే 2011 ప్రపంచకప్‌ ప్రయాణంలో ఇప్పటివరకు బయటపడని ఓ రహస్యాన్ని టర్బోనేటర్‌ హర్భజన్‌ సింగ్‌ బయటపెట్టాడు. 

 

గ్యారీ కిర్‌స్టెన్ నిబంధన

కోచ్‌ గ్యారీ కిర్‌స్టెన్‌ పెట్టిన ఓ షరతు వల్ల తాము ప్రశాంతంగా ఉండగలిగామని ఆనాటి మధుర జ్ఞాపకాలను ఈ స్పిన్‌ మాంత్రికుడు గుర్తు చేసుకున్నాడు. 2011 క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ ఆటగాళ్లెవరూ వార్తా పత్రికలు చదవకూడదనే నిబంధన విధించాడని హర్భజన్‌ గుర్తు చేసుకున్నాడు. భారత జట్టులో ఒక ఆటగాడు ఒక మ్యాచ్‌లో విఫలమైతే అతడి గురించి మీడియాలో భారీ విమర్శలు వస్తాయని, అందుకే వార్తా పత్రికలు చదవద్దని, చదివితే అది మానసికంగా ప్రభావితం చేస్తుందని గ్యారీ సూచించాడని హర్భజన్‌ నెమరు వేసుకున్నాడు. 

 

టీమిండియా క్రికెటర్లకు సలహా

2011లో వార్తా పత్రికలు చదవకపోవడం  కూడా 2011లో తమ విజయంలో కీలక పాత్ర పోషించిందని హర్భజన్‌ అన్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదని, సోషల్‌ మీడియా ఆటగాళ్ల మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని అన్నాడు. 

కాబట్టి ఈ ప్రపంచకప్‌లో కూడా భారత క్రికెటర్లు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని హర్భజన్‌ సలహా ఇచ్చాడు. వచ్చే రెండు నెలలు ఆటగాళ్లు తమ ఫోన్లకు దూరంగా ఉండాలని టర్బోనేటర్ సూచించాడు. 

 

అశ్విన్‌ తుది జట్టులో ఉండాల్సిందే

ప్రపంచకప్‌ జట్టులోకి అశ్విన్‌ ఎంపికను కూడా హర్భజన్‌ ప్రశంసించాడు. ప్రస్తుతం అత్యున్నత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ ఒకడని.. అతడిని తుది జట్టులో ఉండేలా చూసుకోవాలని  టీమ్ మేనేజ్‌మెంట్‌కు హర్భజన్‌ సూచించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో అశ్విన్‌  రెండు మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు పడగొట్టిన విషయాన్ని టర్బోనేటర్‌ గుర్తు చేశాడు. ప్రత్యర్థి జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లు ఎక్కువగా ఉంటే అశ్విన్‌ తుది జట్టులో తప్పక ఉండాలని సూచించాడు. తాను జట్టుకు కెప్టెన్‌గానో .. మేనేజ్‌మెంట్‌లో భాగమైతే ఐదుగురు అత్యుత్తమ బౌలర్లలో అశ్విన్‌ను కూడా చేరుస్తానని హర్భజన్‌ అన్నాడు. ఆ అయిదుగురి జాబితాలో అశ్విన్‌ తొలి రెండు స్థానాల్లోనే ఉంటాడని ఈ స్పిన్‌ మాంత్రికుడు అన్నాడు. అశ్విన్ ఈ ప్రపంచకప్‌లో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శిస్తాడని హర్భజన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. కుల్‌దీప్‌కు తోడుగా అశ్విన్ ఈసారి ప్రపంచకప్‌లో భారత బౌలింగ్ విభాగానికి కీలకంగా మారుతారని టర్బోనేటర్‌ అభిప్రాయపడ్డాడు.