సినిమా రివ్యూ : చిన్నా
రేటింగ్‌ : 3/5
నటీనటులు : సిద్ధార్థ్, నిమిషా సజయన్, సహస్ర శ్రీ, అంజలి నాయర్ తదితరులు
మాటలు, పాటలు : కృష్ణకాంత్
ఛాయాగ్రహణం : బాలాజీ సుబ్రమణ్యమ్ 
నేపథ్య సంగీతం : విశాల్ చంద్రశేఖర్
స్వరాలు : దిబు నినన్ థామస్, సంతోష్ నారాయణన్
నిర్మాత : సిద్ధార్థ్
దర్శకత్వం : ఎస్.యు. అరుణ్ కుమార్!
విడుదల తేదీ: అక్టోబర్ 6, 2023


సిద్ధార్థ్ హీరోగా నటించి, నిర్మించిన సినిమా 'చిన్నా' (Chinna Movie). తమిళంలో సెప్టెంబర్ 28న విడుదలైంది. ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ప్రచారం కోసం కర్ణాటక వెళ్ళినప్పుడు సిద్ధార్థ్ (Siddharth)ను అడ్డుకోవడం, ఆ తర్వాత శివ రాజ్ కుమార్ సారీ చెప్పడం... మొత్తం మీద వార్తల్లో నిలిచిందీ సినిమా. అసలు, చిన్నా (Chinna Movie Review) ఎలా ఉంది?


కథ (Chinna Movie Story) : చిన్నా అలియాస్ ఈశ్వర్ (సిద్ధార్థ్)కు అన్నయ్య కుమార్తె చిట్టి అలియాస్ సుందరి (సహస్ర శ్రీ) అంటే ప్రాణం. స్కూల్ నుంచి తీసుకు వచ్చిన తర్వాత నుంచి మరుసటి ఉదయం స్కూల్‌కు తీసుకు వెళ్లే ఆ చిన్నారిని విడిచి పెట్టి ఉండదు. ఒక రోజు చిట్టిని స్కూల్ దగ్గర వదిలి ఆమె ఫ్రెండ్, ఈశ్వర్ ఫ్రెండ్ అక్క కుమార్తె మున్నీని తీసుకువెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఆ చిన్నారిపై అత్యాచారం జరిగిందని తెలుస్తుంది. ఆ పాడు పని చేసింది ఈశ్వర్ అని అందరూ అనుమానిస్తారు. ఆఖరికి వదిన కూడా అనుమానించడం మొదలు పెడుతుంది. అప్పుడు ఈశ్వర్ ఏం చేశాడు? ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకు చిట్టి కనిపించకుండా పోతుంది. ఆమెను వెతికే క్రమంలో ఈశ్వర్ ఏం తెలుసుకున్నాడు? ఈశ్వర్ ప్రేమించిన అమ్మాయి శక్తి (నిమిషా సజయన్) వల్ల అతడిలో ఎటువంటి మార్పు వచ్చింది? చివరకు ఏమైంది? అనేది సినిమా.  


విశ్లేషణ (Chinna 2023 Movie Review) : చిన్నారి ఆడపిల్లలపై లైంగిక వేధింపుల నేపథ్యంలో సాయి పల్లవి 'గార్గి', 'లవ్ స్టోరీ' వచ్చాయి. మరోసారి ఆ అంశాన్ని 'చిన్నా'లో స్పృశించారు. బహుశా... ఈ సినిమాలో చెప్పినంత బలంగా మరో సినిమాలో చెప్పలేదేమో!? 'చిన్నా'లో చెప్పిన విషయాన్ని ఇంతకు ముందు ఎవరు చెప్పలేదు. 


ప్రతిరోజూ ప్రపంచంలో, మన దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ప్రాంతంలో కామాంధుల చేతుల్లో బలవుతున్న చిన్నారుల గురించి వార్తల్లో మనమంతా చదువుతున్నాం, వింటున్నాం! చిన్నారులపై కావచ్చు, మహిళలపై కావచ్చు... అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను చంపేయాలనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తం అవుతుంది. అందుకు అనుగుణంగా ఎన్కౌంటర్లు జరిగిన ఉదంతాలు ఉన్నాయి. 


అత్యాచారం జరిగిన తర్వాత దోషులను శిక్షించాలని ఆగ్రహావేశాలు వ్యక్తం చేసే ప్రజలు... శారీరకంగా, మానసికంగా ఎంతో నలిగిన అమ్మాయి గురించి ఎంత మంది ఆలోచిస్తున్నారు? ఆ మానసిక వేదన నుంచి ఆమెను ఏ విధంగా బయట తీసుకు రావాలని ఎంత మంది ఆలోచిస్తున్నారని సమాజానికి ప్రశ్న సంధించిన సినిమా 'చిన్నా'. 


ప్రేక్షకుడి ఊహలకు కొంచెం అటు ఇటుగా అనుగుణంగా 'చిన్నా' కథ, కథనాలు ముందుకు వెళతాయి. హీరో అత్యాచారం చేశాడని అతడిని అనుమానిస్తారని ఊహించడం పెద్ద కష్టం ఏమీ కాదు. అయితే... సిద్ధార్థ్ నటన ఊహలను మించి ఉంది. దాంతో భావోద్వేగభరిత సన్నివేశాలు ప్రేక్షకులపై బలమైన ముద్ర వేస్తాయి. చిన్నారిని తీసుకు వెళ్లిన వాడు మనకు దొరికితే కొట్టాలని బలంగా అనిపిస్తుంది. చివరలో ఇచ్చిన సందేశం బావుంటుంది. 


ప్రతి సన్నివేశం ప్రేక్షకుల గుండెల్లో బలమైన ముద్ర వేయడానికి కారణం విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం! గుండెలను పిండేసేలా ఆర్ఆర్ ఇచ్చారు. పాటలు ఓకే. సినిమాటోగ్రఫీ బావుంది. దర్శకుడు తాను చెప్పాలనుకున్న విషయాన్ని చాలా సూటిగా, ఎటువంటి డైవర్షన్స్ లేకుండా చెప్పారు. అందువల్ల, కథానాయిక పాత్ర కూడా చివరి వరకు కూరలో కరివేపాకు అయ్యింది. కథనం ఊహించేలా ఉండటం మైనస్. కథను బలంగా నమ్మి ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధార్థ్ ముందుకు రావడమే కాదు... ఉన్నత స్థాయిలో సినిమాను తెరకెక్కించారు. ఎక్కడా రాజీ పడలేదు. 


నటీనటులు ఎలా చేశారంటే : సిద్ధార్థ్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన సినిమాల్లో 'చిన్నా' మొదటి రెండు మూడు స్థానాల్లో తప్పకుండా ఉంటుంది. సగటు మధ్య తరగతి యువకుడి పాత్రలో ఒదిగిపోయారు. ఇంతకు ముందు సినిమాల్లో కనిపించిన సిద్ధార్థ్ వేరు, ఈ సినిమాలో సిద్ధార్థ్ వేరు. చేయని తప్పుకు అందరూ తనను దోషిలా చూస్తుంటే... ఆఖరికి వదిన మాటలు గుండెల్లో గుండుసూదుల్లా గుచ్చుకున్న తరుణంలో సిద్ధార్థ్ కళ్ళతో నటించారు. ప్రేక్షకుల కంట తడి పెట్టించారు.


సిద్ధార్థ్ తర్వాత ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకునే అమ్మాయి చిట్టి పాత్రలో నటించిన సహస్త్ర శ్రీ. సినిమా ప్రారంభంలో చిన్నారి అల్లరి ఆకట్టుకుంటుంది. అపహరణకు గురైన తర్వాత వచ్చే దృశ్యాల్లో చూస్తే గుండె బరువెక్కుతుంది. నిమిషా సజయన్ నటన సహజంగా ఉంది. పోలీసుగా సిద్ధార్థ్ స్నేహితునిగా నటించిన వ్యక్తితో పాటు మిగతా వాళ్ళు కూడా పాత్రల్లో ఒదిగిపోయారు. 


Also Read : 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' రివ్యూ : ఆహాలో హెబ్బా పటేల్ కొత్త సినిమా


చివరగా చెప్పేది ఏంటంటే : చిన్నారులపై లైంగిక వేధింపుల జరగకుండా ప్రజలు, ముఖ్యంగా తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని బలంగా చెప్పే చిత్రం 'చిన్నా'. రాబోయే తరాలకు మెరుగైన భవిష్యత్ కోసం ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో తెలుసుకోవడానికి తప్పకుండా చూడాల్సిన సినిమా 'చిన్నా'. చిన్న పిల్లలకు ఫోనులు ఇవ్వొద్దని చెబుతుంటారు. అయితే... సిద్ధార్థ్ ఓ సన్నివేశంలో 'పిల్లలకు ఫోన్ ఇవ్వకండి అన్నా' అని చెబితే చంప మీద చెల్లున కొట్టినట్లు ఉంటుంది. ఇటీవల కాలంలో ఇటువంటి హార్డ్ హిట్టింగ్ మెసేజ్ ఓరియెంటెడ్ థ్రిల్లర్ రాలేదు. 


Also Read 'మామా మశ్చీంద్ర' రివ్యూ : సుధీర్ బాబు ట్రిపుల్ యాక్షన్ హిట్టా? ఫట్టా?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial