KTR On Jagna :   ఆంధ్రప్రదేశ్ లో ఐటీ కంపెనీలు పెట్టాలని ..  తాను రికమెండ్ చేస్తానని కేటీఆర్ ప్రకటించారు.  వరంగల్ సమీపంలోని మడికొండ ఐటీ పార్క్‌లో రూ.40 కోట్లతో ఏర్పాటు చేసిన క్వాట్రెండ్ సాఫ్టువేర్ కంపెనీని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.   హైదరాబాద్, వరంగల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఐటీ కంపెనీలు రావాలని మంత్రి  వ్యాఖ్యానించారు.  రానున్న పదేళ్లలో హైదరాబాద్‌కు వరంగల్‌కు పెద్దగా తేడా ఉండదని విశ్వాసం వ్యక్తం చేశారు.  ఐటీ రంగంలో భవిష్యత్తు అంతా టైర్ 2 నగరాలదే అని.. ఆంధ్రాలోని భీమవరం, నెల్లూరు ప్రాంతాల్లో భవిష్యత్‌లో ఉజ్వలమైన ఉపాధి అవకాశాలు వస్తాయని కేటీఆర్ అన్నారు.                          


ఏపీలోని పిల్లలకు కూడా టాలెంట్ ఏం తక్కువ లేదన్నారు. బెంగళూరులో ఉన్న 40 శాతం మంది ఐటీ ఉద్యోగులు.. ఆంధ్రా, తెలంగాణ వాళ్లేనని అన్నారు. వాళ్లందరూ తిరిగి సొంత ప్రాంతాలకు రావడానికి రెడీగా ఉన్నారని.. ఏపీలోనూ ఐటీ సంస్థలు పెట్టాలని క్వాడ్రంట్‌ సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రతినిధులకు కేటీఆర్ సూచించారు. జగనన్నకు చెప్పి నేను మీకు జాగా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.వరంగల్ మాత్రమే కాకుండా ఏపీలోని భీమవరం, నెల్లూరుకూ ఐటీ సంస్థలు రావాలన్నారు కేటీఆర్. అక్కడ కూడా ఎన్నారైలు ఐటీ సంస్థలు పెట్టాలని కోరారు. టాలెంట్ ఎవరబ్బ సొత్తు కాదని, టాలెంట్ ఉంటే ఎక్కడైనా కంపెనీలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించవచ్చునని చెప్పారు. అధిక జనాభా నష్టం అని చెప్పారు కానీ అది అబద్ధమన్నారు. మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.


కేటీఆర్ ఉద్దేశం ప్రకారం ఏపీకి అసలు పెట్టుబడులేమీ రావడం లేదు..  ఏదైనా కంపెనీల్ని తానే రికమెండ్ చేస్తానని అన్నట్లుగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు పెట్టుబడుల కోసం పోటాపోటీగా ప్రయత్నించాయి. హీరో ఎలక్ట్రిక్ ప్లాంట్ తో పాటు కియా,  డిక్సన్, హెచ్‌సీఎల్ తో పాటు చంద్రబాబు సీఎంగగా ఉన్న సమయంలో అనేక పరిశ్రమలు ఏపీకి తరలి వచ్చాయి. శరవేగంగా ఉత్పత్తి ప్రారంభించాయి. విజయవాడ సమీపంలో అతి పెద్ద హెచ్సీఎల్ క్యాంపస్ ను నిర్మించారు. విశాఖలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి సంస్థలు వచ్చేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. 


అయితే ప్రభుత్వం మారిన తర్వాత అన్ని ఒప్పందాలను రద్దు చేయడంతో ఎవరూ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాలేదు. విశాఖలో ఉన్న సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా వెళ్లిపోయాయన్న ఆరోపణలు ఉన్నాయి. మిలీనియం టవర్స్ పేరుతో అక్కడ గత ప్రభుత్వం కట్టిన భవనం ఖాళీగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీపై జాలిపడినట్లుగా మంత్రి  కేటీఆర్ కొన్ని ఐటీ కంపెనీలకు రిఫర్ చేస్తానని చెప్పడం.. జాగా ఇప్పిస్తానని  భరోసా ఇవ్వడం ఆశ్చర్యకరంగా మారింది. ఈ అంశంపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.