Telangana Investment: తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో దిగ్గజ సంస్థ రాష్ట్రానికి రావడానికి సిద్ధమైంది. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ప్రముఖ కెయిన్స్ టెక్ సంస్థ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేశారు. ఆ సంస్థ ప్రతినిధులతో సమావేశమై ఎంవోయూ కుదుర్చుకోగా.. అందుకు సంబంధించిన ఫోటోలు, వివరాలను కేటీఆర్ ట్విట్టర్ లో పంచుకున్నారు. తెలంగాణలో అవుట్ సోర్స్‌డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్, కంపౌండ్ సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు కెయిన్స్ టెక్ సంస్థ ప్రకటించింది.
కెయిన్స్ టెక్ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో రూ. 2,800 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీంతో ప్రత్యక్షంగా 2 వేల మందికి ఉపాధి లభించనుంది. రాష్ట్రంలో పెట్టుపడి పెట్టేందుకు ముందుకు వచ్చిన కెయిన్స్ టెక్ కంపెనీని మంత్రి కేటీఆర్ సాదరంగా స్వాగతించారు. సెమీ కండక్టర్ పరిశ్రమకు తెలంగాణ వేదిక కావడం గర్వకారణంగా ఉందంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఫాక్స్ కాన్, కార్నింగ్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థల పెట్టుబడులతో తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలకు గమ్యస్థానంగా మారిందని మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అడ్వెంట్ ఇంటర్నేషనల్ రూ.16,650 కోట్లు పెట్టుబడి
ఇటీవలె గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అయిన అడ్వెంట్ ఇంటర్నేషనల్ రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో రూ.16,650 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు అడ్వెంట్ ఇంటర్నేషనల్ కంపెనీ ఎండీ పంకకజ్ పట్వారీ తెలిపారు. ఈ మేరకు ఆయన, తమ కంపెనీ ప్రతినిధులతో కలిసి తెలంగాణ మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. అడ్వెంట్ ఇంటర్నేషనల్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహకరిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.
రూ.800 కోట్లు పెట్టుబడి పెట్టనున్న మార్స్ గ్రూప్
పెంపుడు జంతువుల ఆహార తయారీ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే సిద్ధిపేటలో రెండు వందల కోట్లు పెట్టుబడిపెట్టిన మార్స్ గ్రూప్ తెలంగాణలో మరో రూ.800 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది. అంతర్జాతీయ సంస్థగా పేరుపొందిన మార్స్ గ్రూప్ తెలంగాణలో వ్యాపార విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. శుక్రవారం మార్స్ సంస్థ చీఫ్ డేటా అండ్ అనలిటిక్స్ ఆఫీసర్ శేఖర్ కృష్ణమూర్తి బృందం అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌తో సమావేశమైంది.
అనంతరం కొత్తశేఖర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ... ఇప్పటికే తాము సిద్దిపేట జిల్లాలో రూ.200 కోట్లు పెట్టుబడులు పెట్టామన్నారు. ఈ పరిశ్రమలో పెంపుడు జంతువుల ఆహార తయారీ చేస్తూ పెద్దఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నామన్నారు. 2021 డిసెంబరులో అదనంగా రూ.500 కోట్ల పెట్టుబడితో కార్యకలాపాల విస్తరణకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. తమ సంస్థ ఉత్పత్తులకు మార్కెట్‌లో స్పందన లభించిందన్నారు. తెలంగాణాలో పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణం ఉందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణాలో తాజాగా మరో రూ.800 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. పరిశోధన, ఆవిష్కరణ, అభివృద్ధి, సుస్థిరత వంటి విభాగాల్లో విస్తరణకు అవకాశాలనూ అందిపుచ్చుకుంటామన్నారు.