టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా వరుసగా ఆందోళనలు చేస్తున్నాయి. వినూత్న కార్యక్రమాలతో వైసీపీ సర్కార్ ను ప్రశ్నిస్తున్నారు. ‘కాంతితో క్రాంతి’ పేరిట కార్యక్రమం నిర్వహిద్దామని పార్టీ శ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ఇళ్లలో లైట్స్ ఆఫ్ చేసి బయటకు వచ్చి 5 నిమిషాల పాటు దీపాలు, సెల్‍ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగిద్దాం. రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్ చేద్దామన్నారు.


‘కాంతితో క్రాంతి’ నిరసన
ప్రగతి వెలుగులు పంచే చంద్రుడుని ఫ్యాక్షన్ పాలకులు చీకట్లో నిర్బంధించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రేపు (శనివారం) రాత్రి 7.00 గంటల నుంచి 7.05 నిమిషాల వరకూ ఇళ్లలో లైట్లు ఆపి, దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్ వెలిగించాలని పిలుపునిచ్చారు. వాహనాల లైట్లు బ్లింక్ చేయడం ద్వారా దార్శనికుడు చంద్రబాబుకి సంఘీభావం తెలపాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు. ‘కాంతితో క్రాంతి’ పేరిట కార్యక్రమం పేరుతో  నిర్వహించే కార్యక్రమంలో ‘బాబుతో నేను’ అంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలన్నారు. వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్‌లు, టార్చ్ లైట్లు.. వీటిలో వేటినైనా తీసుకుని వెలుగు చూపించాలని నారా లోకేష్ అన్నారు. 


చంద్రబాబు కోడలు, లోకేష్ సతీమణి కూడా ట్వీట్ చేశారు. మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తును చీకటి చేసి, దాన్ని కనిపెట్టకుండా మనల్ని కళ్ళు మూసుకో అంటున్నారు కొందరు. చంద్రబాబు గారు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదు అనుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వాళ్లకు తెలీదు. మనమెందుకు చీకట్లో ఉండాలి ? అంటూ బ్రాహ్మణి ట్వీట్ లో ప్రశ్నించారు. ఐదు కోట్లు ఆంధ్రులు ఒక్కటిగా 7 గంటల నుంచి 7.05 నిమిషాల వరకు నిరసన తెలియజేద్దామని పిలుపునిచ్చారు బ్రాహ్మణి.  తాడేపల్లిలోని జగనాసురుని కళ్లు బైర్లు కమ్మేలా కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలకు పిలుపునిచ్చారు.