Satwiksairaj Rankireddy and Chirag Shetty French Open final: భారత స్టార్‌ షట్లర్ల ద్వయం సాత్విక్‌- చిరాగ్‌ శెట్టి జోడి ఫ్రెంచ్ ఓపెన్‌లో అద్భుతం చేసింది. గత ఏడాది అద్భుత ప్రదర్శనతో డబుల్స్‌ విభాగంలో నెంబర్ వన్ ర్యాంక్ దక్కించుకున్న ఈ జోడీ.. 2024 సీజన్‌లో మేజర్ టైటిల్ సాధించింది. సాత్విక్‌- చిరాగ్‌ శెట్టి జోడి 2024 విజేతలుగా అవతరించి చరిత్ర సృష్టించారు. ఆదివారం రాత్రి జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో చైనిస్ తైపీ జోడీ లీ ఝీ హుయ్, యాంగ్ పోపై 21-13, 21-16 తేడాతో సాత్విక్, చిరాగ్ శెట్టి వరుస సెట్లలో గెలుపొందారు. నెంబర్ వన్ జోడీ కేవలం 36 నిమిషాల్లోనే ప్రత్యర్థి జోడీపై విజయాన్ని అందుకుని.. తద్వారా ఈ ఏడాది బీడబ్ల్యూఎఫ్ తొలి మేజర్ టైటిల్ తమ ఖాతాలో వేసుకున్నారు.






అంతకుముందు ఫ్రెంచ్ ఓపెన్‌ సెమీస్‌లో ప్రపంచ ఛాంపియన్లను మట్టికరిపించిన భారత జోడి.. సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీఫైనల్లో కంగ్ మిన్‌హైక్, సీయో సుఎంగ్జే జోడిపై సునాయసంగా విజయం సాధించింది. 21-13, 21-16తేడాతో  వరుస సెట్లలో గెలుపొంది ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ గెలుపుతో వ‌రుస‌గా మూడోసారి ఫ్రెంట్‌ ఓపెన్‌ ఫైనల్‌లో అడుగు పెట్టిన జోడీగా రికార్టు సృష్టించింది. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో చైనీస్ తైపీ జోడీపై ఇదే ఆటను ప్రదర్శించి సీజన్ లో తొలి బీడబ్ల్యూఎఫ్ టైటిల్ సాధించారు. మలేషియా మాస్టర్స్, ఇండియా ఓపెన్ ఫైనల్లో ఓటమి చెందిన సాత్విక్, చిరాగ్ శెట్టి ఈసారి మాత్రం పట్టు విడవలేదు. ఈ ఏడాది జరగనున్న ప్యారిస్ ఒలింపిక్స్‌కు ముందు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించడం భారత జోడీకి మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. 


నెంబర్‌ వన్‌ జోడీగా సాత్విక్, చిరాగ్ శెట్టి
స్టార్‌ షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో మరోసారి సత్తా చాటారు. ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ కైవసం చేసుకుని తమకు  తిరుగులేదని మరోసారి నిరూపించారు. ఇటీవల నిలకడగా రాణిస్తున్న ఈ జోడీ  బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ ప్రకటించిన డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం దక్కించుకుచుంది. ఈ సీజన్‌లో ఆడిన మలేషియా ఓపెన్‌, ఇండియా ఓపెన్‌లల్లో ఈ జోడి రన్నరప్‌గా నిలిచిన ఈ జంట ఏడాదిన్నర తర్వాత తిరిగి టాప్‌కు చేరింది. సింగిల్స్‌లో ప్రణయ్‌ 8వ ర్యాంక్‌ దక్కించుకోగా లక్ష్యసేన్‌ 19వ స్థానంలో నిలిచాడు.