Venkata Ramana Reddy: హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ లను ఓడించిన కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే (Kamareddy MLA) కాటిపల్లి వెంకట రమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రిని అవుతానని తన మనసులో మాట బయటపెట్టారు. రేపొద్దున తాను ముఖ్యమంత్రిని అవుతానని, అప్పుడు తన గాళ్ ఫ్రెండ్‌కు కేబినెట్ హోదా ఇస్తానంటూ సంచలనానికి తెరతీశారు. 2028లో తాను సీఎం ప్లాన్ లో ఉన్నానని, ఆ తరువాత వాళ్లను విడిచి పెట్టేది లేదన్నారు. 2028లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ఇటీవల ఎలాగైతే అన్నారో.. ఇప్పుడు మరో ఛాలెంజ్ చేశారు. బీజేపీ అధికారంలోకి రాకపోతే తాను ఎవరికీ ముఖం చూపించనని స్పష్టం చేశారు.



లంచం తీసుకుంటే వీపులు పగులుతాయంటూ వార్నింగ్.. 
డబ్బులు కలెక్షన్ చేస్తే ఎవరైనా సరే వీపులు పగలకొడతా అంటూ లంచం తీసుకునే అధికారులు, ఉద్యోగులకు ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. డబ్బు వ్యవహారం తీసుకుంటే తాను ఎంతకైనా తెగించి మాట్లాడతా, ఎక్కడి వరకైనా వెళ్తానన్నారు. తాను రోడ్డు మీదకు వచ్చే వరకు చూసుకుంటూ కూర్చుంటే, అది అధికారులకు.. వారి వెనక ఉన్న వారికి అంత మంచిది కాదని హితవు పలికారు. సిన్సియర్ అధికారులను కాళ్లు మొక్కు నైజం తనదని, నిజాయితీ లేని వాళ్లు, లంచం తీసుకునే వారికి తన వార్నింగ్ అన్నారు. తమలో నిజాయితీ లేదని, తమ వల్ల కాదని భావిస్తే కామారెడ్డి నుంచి వాలంటరీ ట్రాన్స్ ఫర్ చేసుకోవాలని వెళ్లిపోవాలని సూచించారు. తాను ముక్కుసూటి వ్యక్తినని, తన నైజం ఇంతేనని ప్రజలకు, అధికారులకు మరోసారి స్పష్టం చేశారు. 


తాను మార్పు కోరుకుంటున్నానని, ప్రజా ప్రతినిధులు నిజాయితీగా ఉంటే.. అధికారులు సైతం అంతే నిజాయితీపరులుగా ఉంటారని నమ్మే వ్యక్తిని తానని చెప్పారు. నిజాయితీగా ఉంటూ మద్యం, డబ్బులు పంచకుండా ప్రజల్లో తిరిగి ఎన్నికల్లో విజయం సాధించిన వ్యక్తినని పేర్కొన్నారు. కలెక్టరేట్ గా ఇదివరకే విషయం చెప్పానని, 100 రోజులు టైమ్ ఇచ్చాం, తప్పులు సరిదిద్దుకోవాలని చెప్పినట్లు గుర్తుచేశారు. డబ్బులు కలెక్ట్ చేస్తున్నారని తెలిస్తే వీపులు పగులుతాయని, ఇప్పటికైనా మారాలని లేకపోతే రోడ్డుమీద గళ్లాపట్టి నిలదీస్తానని బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి హెచ్చరించారు.