Maharastra Politics : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్రలోని మహా వికాస్ ఆఘాడీ (Maha vikas Aghadi)లో లుకలుకలు బయటపడుతున్నాయి. శివసేన (Shivasena Ubt )ఉద్దవ్ ఠాక్రే వర్గం, ఎన్‌సీపీ (NCP Sharad Pawar) శరద్ పవార్ వర్గం, కాంగ్రెస్‌ (Congress ) పార్టీల మధ్య సీట్ల వ్యవహారంపై చర్చలు జరుగుతున్నాయి. మూడు పార్టీలు ఎవరెవరు ఎక్కడెక్కడో పోటీ చేయాలన్న దానిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నాయ్. ఇంతలోనే కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ పీసీసీ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహా వికాస్ అఘాడి కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతుండగా... ముంబై నార్త్-వెస్ట్ నియోజకవర్గానికి శివసేన అభ్యర్థిగా అమోల్ కీర్తికర్‌ను ఉద్దవ్ ఠాక్రే  ప్రకటించడంపై సంజయ్‌ నిరుపమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


మరోసారి అదే సీటుపై గురి 
రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు సంజయ్ నిరుపమ్. ఒకసారి శివసేన తరపున, మరోసారి కాంగ్రెస్ తరపున ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో ముంబై నార్త్-వెస్ట్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. మరోసారి అదే స్థానం నుంచి పోటీ చేయాలని సంజయ్ నిరుపమ్ భావిస్తున్నారు. ఇంతలోనే ఉద్దవ్ ఠాక్రే తమ పార్టీ నుంచి అమోల్ కీర్తికర్‌ పోటీ చేస్తారని ప్రకటించడం నిరుపమ్ కు ఆగ్రహం తెప్పించింది. కూటమిలో సీట్ల షేరింగ్ పూర్తి కాకపోయినా... అప్పుడే ఎలా ప్రకటిస్తారంటూ మండిపడ్డారు. నార్త్ వెస్ట్ సీటు తమదని ఉద్దవ్ వర్గం చెబుతోందని... అయితే ఈ సీటు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థులు ప్రతిసారి పోటీ చేస్తున్న విషయం మరచిపోవద్దని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో  ముంబై నార్త్-వెస్ట్ పోటీ చేస్తానని, ఐదేళ్లుగా నార్త్‌ వెస్ట్‌ సీటు కోసం సిద్ధమవుతున్నానని స్పష్టం చేశారు. నార్త్ వెస్ట్ సీటు విషయంలో కాంగ్రెస్ పార్టీనే తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. 


కుంభకోణంలో చిక్కుకున్న వ్యక్తికి టికెట్? 
కోవిడ్‌ సమయంలో  బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వలస కార్మికుల కోసం ఖిచిడీ పంపిణీ చేసింది. వలస కార్మికుల కోసం చేపట్టిన ఖిచిడీలో స్కామ్ జరిగిందని, ఇందులో అమోల్‌ కీర్తికర్‌ హస్తం ఉందని సంజయ్ నిరుపమ్ ఆరోపించారు. నిరుపేదల కోసం ప్రారంభించిన పథకంలో అమోల్‌ కీర్తికర్‌ అవినీతికి పాల్పడ్డారని అన్నారు. ఖిచిడీ స్కాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోందన్న నిరుపమ్.... కుంభకోణంలో చిక్కుకున్న వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అమోల్‌ కీర్తికర్‌ను  నిలబెడితే కాంగ్రెస్, శివసేన కార్యకర్తలు ఎలా ప్రచారం చేస్తారని నిలదీశారు.