Lok Sabha Polls 2024: లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అన్ని రాష్ట్రాల్లోని పార్టీలు అభ్యర్థులను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాయి. ఒక్కో పార్టీ లిస్ట్‌ని విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడులోని DMK పార్టీ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి MK స్టాలిన్ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఆశావహులకు ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఇప్పటికే పొత్తు లెక్కలు తేల్చిన ఎమ్‌కే స్టాలిన్..ఇప్పుడు పూర్తిగా అభ్యర్థుల ఎంపికపైనే దృష్టి పెట్టారు. అలా అని ఎవరికి పడితే వాళ్లకి ఇవ్వకుండా ఇంటర్వ్యూ చేస్తున్నారు. మార్చి 9న మొదలైన ఈ ఇంటర్వ్యూల ప్రక్రియ ఇవాళ్టి (మార్చి 10) వరకూ కొనసాగింది. ఉదయం 9 గంటల నుంచే ఇవి ప్రారంభమయ్యాయి. వచ్చిన అప్లికేషన్స్‌ని అన్నింటినీ పరిశీలించారు స్టాలిన్. లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఆశిస్తున్న 2,590 మంది తమ అప్లికేషన్‌లు పంపినట్టు తెలుస్తోంది. అందరి అప్లికేషన్స్ చూసి నంబర్‌ల వారీగా పిలిచి వాళ్లతో మాట్లాడారు సీఎం స్టాలిన్. ఆయనతో పాటు మరి కొందరు ఈ ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో సీట్ షేరింగ్ విషయంలోనూ DMK క్లారిటీ ఇచ్చింది. 21 చోట్ల DMK అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. కాంగ్రెస్ తరపున 10 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు.
కాంగ్రెస్, డీఎమ్‌కే పొత్తు గురించి అందరికీ తెలిసిని విషయమే అయినా...ఉన్నట్టుండి కమల్ హాసన్ పార్టీ Makkal Needhi Maiam (MNM) కూడా తెరపైకి వచ్చింది. కాంగ్రెస్‌తో పాటు MNM తోనూ సీట్ల పంపకాలపై డీఎమ్‌కే తుది నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌కి 10 సీట్లు ఇచ్చే అవకాశాలున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. అయితే...కమల్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్‌కి లోక్‌సభ ఎన్నికల్లో కాకుండా వచ్చే ఏడాది రాజ్యసభ ఎన్నికలకు ఓ సీట్ కేటాయించినట్టు సమాచారం. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి సీట్‌లు కేటాయించే అవకాశాలైతే కనిపించడం లేదు. దేశ సంక్షేమం కోసం DMK కూటమితో చేతులు కలిపినట్టు కమల్ హాసన్ వెల్లడించారు. తాన ఏదో పదవి ఆశించి ఈ కూటమిలో చేరలేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్‌ని కలిసిన తరవాత కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మొత్తం 39 లోక్‌సభ నియోజకవర్గాల్లో కూటమి తరపున ప్రచారం చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే I.N.D.I.A కూటమిలో కాంగ్రెస్‌తో కలిసి పొత్తు పెట్టుకుంది డీఎమ్‌కే.