Gaami Day 2 Box Office Collections: టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో చాందినీ చౌదరి హీరోయిన్ గా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘గామి’. విద్యాధర్ దర్శకత్వంలో అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ చిత్రం శివరాత్రి కానుకగా మార్చి 8న  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తోంది. మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకెళ్తోంది. ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ ఈ మూవీకి మంచి స్పందన లభిస్తోంది.


రెండు రోజుల్లో రూ. 15 కోట్లు వసూళు


తొలి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘గామి’ సినిమా రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించింది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.9.07 కోట్ల కలెక్షన్స్‌ సాధించిన ఈ సినిమా.. రెండు రోజుల్లో  ఏకంగా రూ. 15.1 కోట్లు  సాధించినట్లు చిత్రబృందం తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది. వీకెండ్ లో ఈ సినిమా మరింత దూకుడుగా వెళ్లే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. తొలి రెండు రోజులకు మించి మూడో రోజు వసూళ్లు సాధించే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు.






ప్రేక్షకులకు విజువల్ ట్రీట్


ఇక ఈ సినిమా కోసం దర్శకుడు విద్యాధర్ చాలా కాలంగా కష్టపడ్డారు. సుమారు ఈ చిత్రం కోసం ఐదారు సంవత్సరాలుగా పని చేస్తున్నారు. తక్కువ బడ్జెట్ లోనే అద్భుతమైన సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజువల్ ట్రీట్ ప్రేక్షకులను ఆహా అనిపిస్తోంది. తెలుగులో ఇప్పటి వరకు ఏ సినిమాలో లేని విధంగా ఈ చిత్రంలో విజువల్స్ ఆకట్టుకున్నాయంటున్నారు. అంతేకాదు, ఈ సినిమాలోని చాలా సన్నివేశాలు హాలీవుడ్ సీన్లను తలదన్నేలా ఉన్నాయంటున్నారు. దర్శకుడు విద్యాధర్ పని తీరు అద్భుతం అంటూ ప్రశంసిస్తున్నారు. ఆయన టేకింగ్ మరో లెవల్ అంటున్నారు. విశ్వక్ సేన్ కెరీర్ లోనే ‘గామి’ మైల్ స్టోన్ గా మిగిలిపోతుందని పలువు సినీ ప్రముఖు అభిప్రాయపడుతున్నారు.


‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్లేస్ లో ‘గామి’ విడుదల


‘గామి’ సినిమాలో ఎంజీ అభినయ, మహ్మద్‌ సమద్‌, దయానంద్‌ రెడ్డి, హారిక, శాంతి రావు కీలక పాత్రలు పోషించారు. వీ సెల్యూలాయిడ్‌ సమర్పణలో కార్తీక్ శబరీష్‌ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.నరేష్ కుమారన్ సంగీతం అందించారు.  అటు విశ్వక్  ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రంలోనూ నటిస్తున్నారు. నిజానికి 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' సినిమా మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా థియేటర్లలో రిలీజ్ కావాల్సింది. అయితే అనుకోని కార‌ణాల వ‌ల్ల ఈ మూవీ వాయిదా పడటంతో, దాని ప్లేస్ లో విశ్వక్‌ సేన్ నటించిన 'గామి' సినిమాను విడుదల చేశారు. ఇందులో విశ్వక్ సేన్ కోనసీమ కుర్రాడిగా కనిపించనున్నారు. డీజే టిల్లు ఫేం నేహా శెట్టి హీరోయిన్‌ గా నటిస్తుండగా.. తెలుగమ్మాయి అంజలి కీలక పాత్ర పోషిస్తోంది. కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.


Read Also: ‘స్పైడర్ మ్యాన్ 4’ రాబోతుందా? దర్శకుడు సామ్ రైమి కీలక వ్యాఖ్యలు!