మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీని పోలీసులు అరెస్టు చేశారు. తను నివాసముండే రెసిడెన్షియల్‌ సొసైటీ గేటును కారుతో ఢీకొట్టడంతో ముంబయిలోని బాంద్రా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు.


ఐపీసీ సెక్షన్‌ 279 (rash driving), 336 (ఇతరుల భద్రతకు భంగం కలిగించడం), 427 (నష్టం కలిగించడం) ప్రకారం కాంబ్లీపై అభియోగాలు నమోదు చేశామని బాంద్రా పోలీసు స్టేషన్‌ అధికారులు తెలిపారు.


వినోద్‌ కాంబ్లీ అద్భుతమైన క్రికెటరే అయినా అత్యంత వివాదాస్పదుడుగా మారాడు. అతడిపై ఎన్నో వివాదాలు వచ్చాయి. కేవలం 28 ఏళ్ల వయసులో వినోద్ కాంబ్లీ టీమిండియా జట్టులో చోటు కోల్పోయాడు. ఆ తర్వాత రెండు సినిమా నిర్మాణ సంస్థలను ప్రారంభించి సినిమా ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ముంబైలో ఈ లోక్‌భారతి పార్టీ ఉపాధ్యక్షుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా ఓటమిపాలయ్యారు. 2010లో మోడల్ ఆండ్రియా హెవిట్‌ని వివాహం చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. ఆటపై అతడు ఫోకస్ చేసి ఉంటే కచ్చితంగా మళ్లీ టీమిండియాకు ఆడేవాడని మాజీ క్రికెటర్లు, కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ పలు సందర్భాలలో చెప్పేవారు.