Milan 2022: విశాఖ వేదికగా జరుగుతున్న మిలాన్-2022 కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం విశాఖ చేరుకున్న సీఎం జగన్ నేరుగా తూర్పు నౌకాదళ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ నౌకాదళ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఐఎన్‌ఎస్-విశాఖ నౌకను సీఎం జగన్ జాతికి అంకితం చేశారు. ఐఎన్‌ఎస్-విశాఖ నౌక పశ్చిమ నౌకాదళంలో సేవలు అందిస్తుంది. ఐఎన్‌ఎస్ వేల జలాంతర్గామిని సీఎం సందర్శించారు. సాయంత్రం విశాఖ బీచ్‌లో జరిగే మిలాన్-2022 సీఎం హాజరై ప్రసంగిస్తారు. ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ కార్యక్రమాలు వీక్షిస్తారు. సీఎంతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎం.వి.వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్య అతిథిగా సీఎం జగన్(CM Jagan)
ఆర్కే బీచ్ లో మిలాన్-2022 ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌కు ముఖ్య అతిథిగా సీఎం జగన్ హాజరవుతారు. గంటన్నరపాటు జరిగే సముద్ర యుద్ధ విన్యాసాలు, గగనతల వాయుసేన విన్యాసాలను సీఎం జగన్ దంపతులు వీక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో 39 దేశాల ప్రతినిధులు, 13 దేశాల యుద్ధనౌకలు పాల్గొంటాయి.
మిలాన్-2022 విన్యాసాలు
విశాఖపట్నం తీరం మిలాన్-2022 (Milan 2022) మెరుపులతో అంగరంగ వైభవంగా దర్శనమిస్తోంది. ఓ పక్క సముద్రం అంతా నౌకలతో నిండి ఉండగా, రోడ్లన్నీ రంగుల మయంగా దర్శనమిస్తున్నాయి. అయితే ఈ నెల 25 నుంచి మిలాన్ విన్యాసాలు ప్రారంభమైనట్లు నావికాదళం ప్రకటించింది. 27న జరుగనున్న ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌కు (Milan-2022 International City Parade) నమూనా విన్యాసాలను శనివారం సాయంత్రం ఆర్‌కే బీచ్‌లో (RK Beach) నిర్వహించారు. ఆపరేషనల్ పరేడ్ డెమాన్‌స్ట్రేషన్‌గా పిలిచే ఈ విన్యాసాల్లో యుద్ధ నౌకలు, సీ హార్స్, యుద్ధవిమానాలు, ఫ్లై పాక్స్, నీటిలో నీలి రంగు బాంబర్లు, పారాచూట్లపై ఆకాశంలోకి ఎగరడం, నౌకలో ప్రమాదం జరిగితే అక్కడ ఉన్నవారిని పారా చూట్‌లోకి దిగి రక్షించడం వంటి విన్యాసాలు అత్యంత ఘనంగా జరిగాయి. యుద్ధం జరుగుతున్న సమయంలో నౌక ప్రమాదానికి గురైన వేళలో గగనతలంలో ఎగిరే యుద్ధవిమానాల నుంచి నిచ్చెన మెట్లపై ఓడలోకి కమాండోలు దిగి అందులో వారిని రక్షించే విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి. సీ హార్స్, ఫ్లై పాక్స్ గగనతంలో చేసిన సందడికి ఆకాశమే హద్దుగా జరిగింది. కమాండోలు తుపాకులతో తీరం ఒడ్డున చేసిన యుద్ధవిన్యాసాలు, మెరైన్ కమాండోలు సముద్రంలో ఓడలపై నీటిబాంబర్లతో శతృ నౌకలపై విసురుతూ వారిని మట్టుపెట్టే దృశ్యాలు అలరించాయి.
లేజర్ పాయింట్ విన్యాసాలు
ఆకాశంలోకి ఒకేసారి 10 యుద్ధవిమానాలు నిప్పులు చెరుగుకుంటూ, కాంతులూ వెదజల్లుతూ వెళ్లే దృశ్యాలు చూపరులను గగుర్పాటుకు గురిచేశాయి. వీటిని నేవీ అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు సహా సాధారణ జనం ఈ దృశ్యాలను తిలకించారు. నేవీ స్కూల్ చిల్డ్రన్స్, సిటీ పోలీసులు, నావికాదళానికి చెందిన సైలర్లు, ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన వారు యూనిఫాంలు ధరించి బీచ్ రోడ్డులో ఈ పరేడ్ చేపట్టారు. అనంతరం లేజర్ పాయింట్ విన్యాసాలు ఆర్‌కే బీచ్‌లో అందరినీ ఆకట్టుకున్నాయి.