Starlink Internet Ukraine: బాంబుల మోతతో కల్లోలిత ప్రాంతంగా మారిన ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్‌ (Star Link) ఇంటర్నెట్‌ సర్వీసులను యాక్టివేట్‌ చేశామని టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సీఈవో ఎలన్‌ మస్క్‌ (Elon musk) అన్నారు. త్వరలోనే మరిన్ని టెర్మినల్స్‌ అందుబాటులోకి వస్తాయని తెలిపారు. నిరంతరాయంగా ఇంటర్నెట్‌ సేవలు అందిస్తామని వెల్లడించారు.


రష్యా సైనిక చర్యకు దిగడంతో ఉక్రెయిన్‌లోని చాలా నగరాల్లో ఇంటర్నెట్‌, ఇతర సాంకేతిక నెట్‌వర్క్‌లు దెబ్బతిన్నాయి. దాంతో ప్రజలకు ఇంటర్నెట్‌ అందడం లేదు. స్టార్‌లింక్‌ ద్వారా తమకు ఇంటర్నెట్‌ అందించాలని ఉక్రెయిన్‌ ఉపాధ్యక్షుడు మైఖేలియో ఫెడొరోవ్‌ టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ను కోరారు.


'ఎలన్‌ మస్క్‌, మీరు మార్స్‌పై కాలనీలను స్థాపించాలనుకుంటే రష్యానేమో ఉక్రెయిన్‌ను ఆక్రమించాలని చూస్తోంది. మీ రాకెట్లు అంతరిక్షం నుంచి విజయవంతంగా ల్యాండ్‌ అవుతోంటే రష్యా రాకెట్లు ఉక్రెయిన్‌ పౌరులపై దూసుకొస్తన్నాయి. మేం రష్యన్లను నిలువరించేందుకు స్టార్‌లింక్‌ స్టేషన్లను యాక్టివేట్‌ చేయండి' అని ఫెడొరోవ్‌ ట్వీట్‌ చేశారు. 'స్టార్‌ లింక్‌ సేవలు ఇప్పుడు ఉక్రెయిన్‌లో అందుబాటులోకి వచ్చాయి. మరిన్ని టెర్మినల్స్ దారిలో ఉన్నాయి' అని మస్క్‌ బదులిచ్చారు.


టెరెస్ట్రియల్‌ ఇంటర్నెట్‌ సదుపాయం లేనిచోట ఇంటర్నెట్‌ సేవలు అందించేందుకు స్టార్‌లింక్‌ సహా చాలా సంస్థలు చిన్న చిన్న ఉపగ్రహాలను లో ఎర్త్‌ ఆర్బిట్‌లోకి పంపిస్తున్నాయి. లో లేటెన్సీ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సేవలు కల్పిస్తున్నాయి. ప్రస్తుతం ఉత్తర ఉక్రెయిన్‌లోని ఖార్‌కివ్‌ నగరంలో ఇంటర్నెట్‌ సేవలకు అంతరాయం ఏర్పడిందని తెలిసింది. ఇది రష్యా సరిహద్దుకు 25 మైళ్ల దూరంలో ఉంటుంది.


Also Read: చర్చలకు రష్యా ఓకే- సమావేశం కాదు ఇక సమరమే అంటోన్న ఉక్రెయిన్


Also Read: చేతిలో భారత జెండా, దేశభక్తి ఊపిరి నిండా- భారతీయులకు రక్షణ కవచంగా త్రివర్ణ పతాకం


మరోవైపు అమెరికా, ఐరోపా దేశాలు రష్యాపై ఆర్థిక యుద్ధం చేస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమని రష్యా అధికారిక భవనం క్రెమ్లిన్ ప్రకటించింది. ఇందుకోసం రష్యా బృందం బెలారస్ గోమల్‌కు నగరానికి చేరుకుంది. ప్రస్తుత వివాదంపై ఇరు దేశాల అధికారులు చర్చించనున్నారు.


ఇప్పటికే ఉక్రెయిన్‌లో పలు నగరాల్లో రష్యా విధ్వంసం సృష్టించింది. ఉక్రెయిన్ సైనిక వాహనాలు, పలు యుద్ధ విమానాలను నామరూపాల్లేకుండా చేసినట్లు రష్యా రక్షణ శాఖ పేర్కొంది.