IND vs SL, Ishan kishan Injury: టీమ్‌ఇండియా యువ వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ను ఆస్పత్రిలో జాయిన్‌ చేశారు. శ్రీలంకతో రెండో టీ20లో అతడి తలకు బౌన్సర్‌ తగలడమే ఇందుకు కారణం. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలిసింది. బీసీసీఐ మాత్రం ఇంకా అధికారికంగా ఏ విషయం చెప్పలేదు.


Ishan Kishan తలకు గాయం


ధర్మశాల వేదికగా శనివారం టీమ్‌ఇండియా, శ్రీలంక రెండో టీ20లో తలపడ్డాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన లంకేయులు 183/5 పరుగులు చేశారు. ఛేదనలో రోహిత్‌ శర్మ (1) విఫలమయ్యాడు. ఇషాన్‌ కిషన్‌ (16; 15 బంతుల్లో 2x4) మరీ ఎక్కువ పరుగులు చేయలేదు. నాలుగో ఓవర్లో లాహిరు కుమార 146 కిలోమీటర్ల వేగంతో వేసిన బౌన్సర్‌ ఇషాన్‌ కిషన్‌ హెల్మెట్‌కు బలంగా తగిలింది. మైదానం నుంచి డ్రెస్సింగ్‌ రూమ్‌కు రావాలని ఫిజియో సూచించినా అతడు బ్యాటింగ్‌ కొనసాగించాడు. మరికాసేపటికే ఔటయ్యాడు.


చికిత్స కోసం ఆస్పత్రికి


మ్యాచ్ ముగిసిన వెంటనే చికిత్స కోసం ఇషాన్‌ కిషన్‌ను కాంగ్రాలోని ఫోర్టిస్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడికి సీటీ స్కాన్‌ చేయించారు. ముందు జాగ్రత్తగా సాధారణ వార్డులో అడ్మింట్‌ చేశారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉందని తెలుస్తోంది. అదే సమయంలో శ్రీలంక ఆటగాడు దినేశ్‌ చండిమాల్‌నూ అదే ఆస్పత్రిలో చేర్పించారు. గాయపడటమే ఇందుకు కారణం.


2-0తో సిరీస్‌ కైవసం


Ind VS SL 2nd T20I: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 183 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా 17.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో సిరీస్‌ను కూడా 2-0తో విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ (74 నాటౌట్: 44 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. రవీంద్ర జడేజా (45 నాటౌట్: 18 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్), సంజు శామ్సన్ (39: 25 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) రాణించారు.